Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 17, 2011

0 comments Posted by tyagaraju on 3:46 PM


18.12.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 11 వ భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993

13.08.1993 శుక్రవారము

రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి బాబా నా ఆఖరి శ్వాస నీ పాదాల మీద తీసుకొంటావా లేదా? మరియు నా ఆఖరి శ్వాసకు ముందు, నేను, నాభార్యపిల్లల ఋణము తీర్చుకొంటానా లేదా అని ప్రశ్నించినాను. శ్రీ సాయి దృశ్య రూపములో యిచ్చిన సమాధానాలు నన్ను సంతోష పరిచినాయి. శ్రీ సాయి తమిళనాడు గవర్నరు శ్రీ చెన్నారెడ్డి రూపములో దర్శనము యిచ్చినారు. ఆయన ముందు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. నేను ఆయన దర్శనమునకు వెళ్ళినాను . శ్రీ చెన్నారెడ్డి అంతమంది ప్రముఖులలో నన్ను నా పేరుతో పిలిచి ఏమికావాలి అనడిగినారు. నేను వారి పాద పూజ చేసుకోవాలి అనే కోరికతో వచ్చినాను అని చెప్పినాను. ఆయన చిరునవ్వుతో నన్ను దగ్గరకు చేరతీసి నా శిరస్సుపై చేయి వేసి నా శిరస్సును ఆయన పాదాలపై ఉంచుకొన్నారు. అప్పుడు నేను ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నాను. వెంటనే తెలివి వచ్చినది. నిద్ర లేచి శ్రీ సాయికి నమస్కరించి సంతోషముగా నిద్రపోయినాను. తిరిగి కలలో శ్రీ సాయి మెహదీపట్నములో నేను నెల నెల సరుకులు కొనే కిరాణా దుకాణము యజమాని (కిరాణా దుకాణము యజమాని ముస్లిం) రూపములో దర్శనము యిచ్చి నన్ను పిలిచి మీరు యిచ్చిన డబ్బుతో మీ భార్యా, పిల్లలకు జీవితాంతము తినటానికి కావలసిన సరుకులు మీ యింటికి పంపినాను అన్నారు. నాకు తెలివి వచ్చినది. సంతోషముగా శ్రీ సాయికి నమస్కరించినాను. నేను కోరుకొన్న రెండు కోరికలు శ్రీ సాయి నెరవేర్చుతారు అని నమ్మకము కుదిరినది.

15.08.1993 ఆదివారము

నిన్నటి రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి భవిష్యత్ లో నీ సేవ చేసుకొంటు పదిమంది సాయి బంధువుల వెనుక నేను తిరుగుతు వారికి శ్రీ సాయి తత్వము తెలియచేయాలా లేక పదిమంది సాయి బంధువులు నా దగ్గరికి వచ్చినపుడు వారికి శ్రీ సాయి తత్వము తెలియచేసుకుంటు నీ సేవ చేసుకొంటున్న తృప్తిని పొందాలా దయచేసి తెలియ చేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్య రూపములో యిచ్చిన సూచనలు.

1) నేను కుటుంబ సమేతముగా తిరుమల తిరుపతి యాత్రకు వెళతాను. అక్కడ నా కుటుంబ సభ్యులు అందరు ను చెప్పిన రీతిగా శ్రీ వెంకటేశ్వరుని (శ్రీ సాయిని) పూజించుతారు.

2) అన్ని రాష్ట్రములనుండి లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు నాయింటికి నన్ను కలుసుకొనేందుకు వస్తారు. వారి అందరితోను నేను శ్రీ సాయి గురించి మాట్లాడుతాను.

3) శ్రీ సాయి నా స్నేహితుడు టీ.వీ.జీ. రూపములో దర్శనము యిచ్చి తన కుమార్తె పెండ్లి పిలుపులకోసము హిందూ ముస్లిం స్నేహితులను తీసుకొని నా యింటికి వస్తారు. సమయములో నా యింట కొందరు నెత్తిమీద రుమాళ్ళు కట్టుకొని నమాజు చేస్తారు. మరికొందరు పూలతో శ్రీ సాయికి పూజ చేస్తారు. శ్రీ సాయి ఆదేశానుసారము నేను యింటివద్ద (నంబరు 7-204) యుంటు శ్రీ సాయి సేవ చేసుకోవాలి అని నిశ్చయిం చుకొన్నాను.

17.08.1993 మంగళవారము

నిన్న రాత్రి నిద్రలో శ్రీ సాయి నాకు యిచ్చిన సూచనలు

1) నీ ఆఖరి శ్వాస వరకు తెల్లని వస్త్రాలు ధరించు

2) శ్రీ సాయి కాలేజీలో చేరి సాయి తత్వము తెలుసుకో

3) తక్కువ సామానులు (ఆస్థిపాస్తులు) తో జీవనము గడుపు

4) భార్య వ్యామోహము కొంత వరకు తగ్గించి బ్రహ్మచర్యమును పాటించు

5) మాంసాహారము, త్రాగుడు నిషేధించు

6) నీ భోజనానికి డబ్బు ఎవరినీ అడగవద్దు. నీ భోజనానికి కావలసిన ధనము నేనే ఇస్తాను. -- శ్రీ సాయి.

18.08.1993 బుధవారము

రాత్రి నిద్రలో శ్రీ సాయి యిచ్చిన సందేశము, సూచనలు

1) అన్ని మతాలలోని సారాంశము ఒక్కటే. భగవంతుని పూజించేముందు నీతోటివానిని గౌరవించు. అందరిలోను భగవంతుని చూడు.

2) భవిష్యత్ లో బియ్యము ధర విపరీతముగా పెరిగి పోతుంది. న్యాయము కోసము కోర్టులకు పరిగెడుతారు ప్రజలు.

3) భవిష్యత్ లో విద్యాలయాలలో నైతిక విలువలు పడిపోతాయి. గురు శిష్యుల అనుబంధమునకు వక్ర భాష్యము చెబుతారు ప్రజలు.

(ఇంకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Thursday, December 15, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 7:59 AM


16.12.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993, 11 వ భాగాన్ని చదువుకుందాము


సాయి.బా.ని.స. డైరీ 1993

16.08.1993 శుక్రవారము

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఫకీరు రూపములో సముద్రపు ఒడ్దున నిలబడి యున్నారు. నేను వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించినాను. వారు నన్ను చూసి అన్న మాటలు "జీవితము సముద్రపు ఒడ్డువంటిది. సముద్ర కెరటాలు సుఖాలు వంటివి. సముద్రపు పోటు మీద ఉన్న సమయములో సుఖాలు అనే కెరటము ఒడ్డుకు వస్తుంది. నీటిలో అహంకారము అనే పాములు, కష్ఠాలు అనే చేపలు, దైవ చింతన అనే ముత్యపు చిప్పలు హాయిగా ఈత కొడతాయి. సముద్రమునకు ఆటు వచ్చినపుడు కెరటము తిరిగి సముద్రములోనికి వెళ్ళిపోతుంది. సమయములో నీలోని అహంకాము అనే పాములు, కష్ఠాలు అనే చేపలు సముద్రపు ఒడ్డున గిలగిల లాడుతాయి. సముద్రపు ఒడ్డున ఉన్నరాళ్ళమధ్య నిలిచిన నీరులో దైవ చింతన అనే ముత్యపు చిప్పలు ప్రశాంతముగా ఉంటాయి. అందుచేత నీ జీవితము అన్ని కాలాల్లోను దైవ చింతన అనే ముత్యపు చిప్పలాగ బ్రతకటము నేర్చుకో" కల చెదిరి పోయినది. మెలుకువ వచ్చినది. కలలోని అర్థము గురించి వెతక సాయినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 16,17 అధ్యాయములలో శ్రీ సాయి అన్నమాటలు "జీవితములో అసూయ, అహంభావము అనే మొసళ్ళతో నిండియున్నాయి" మరొక్కసారి నిజము అని గుర్తించినాను. 51 . అధ్యాయములో హేమాద్రిపంతు అంటారు జీవితములో కోపము, అసూయ మొసళ్ళువంటివి. పరనింద, అసూయ, ఓర్వలేని తనము చేపలు వంటివి. మహాసముద్రము భయంకరమైనప్పటికి శ్రీ సాయి సద్గురువుదానికి అగస్త్యునివంటివాడు (నాశనము చేయువాడు). సాయి భక్తులకు దానివలన భయమేమి యుండదు. శ్రీ హేమాద్రిపంతు మాటలతో నేను ఏకీభవించుతాను.

12.08.1993 గురువారము

నిన్నటి రాత్రి మనసులో కుటుంబ వ్యవహారాలపై చాలా చికాకు కలిగినది. మనసుకు ప్రశాంతత కరువు అయినది. నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ప్రశాంతత ప్రసాదించమని వేడుకొన్నాను. రాత్రి కలలో యిద్దరు పెద్ద మనుషులు కారులో నాయింటికి వచ్చి తమతో గోవాకు వచ్చి చక్కగా ఓ వారము రోజులు కాలక్షేపము చేసి వెళ్ళండి. మీ మానసిక బాధలు పోతాయి అన్నారు. నేను కట్టు బట్టలతో వారితో కారులో బయలుదేరినాను. కారు కొంచము దూరము వెళ్ళిన తర్వాత నిత్య పారాయణ చేయటానికి కావలసిన శ్రీ సాయి సత్ చరిత్ర యింటిలో మర్చిపోయినాను అని ఆ డ్రైవరుకు చెబుతాను. కారును వెనక్కి తిప్పమని చెబుతాను. మెలుకువ వచ్చినది. ఉదయము చాలా సేపు ఈ కల గురించి ఆలోచించసాగినాను. 8 గంటలకు ఆఫీసుకు బయలుదేరటానికి సిధ్ధ పడుతుంటే రోజు నాకు మార్నింగ్ వాక్ లో కలిసే పద్ద మనిషి శ్రీ హఫీజ్ బాబా నా యింటిముందునుండి వెళుతూ నా యింటికి వచ్చినారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. తెల్లని గెడ్డము నెత్తిమీద తెల్లని బట్టతో శ్రీ సాయినాధుని పోలియుంటారు. ఆయనను నా యింటిలోనికి `తీసుకుని వచ్చి నేను, నా భార్య, పిల్లలము ఆయన పాదాలకు నమస్కరించి శ్రీ సాయి పాదాలకు నమస్కరించిన అనుభూతిని పొందినాము. ఆయనకు గోరువెచ్చని పాలు త్రాగటానికి యిచ్చినపుడు ఆయన సంతోషముతో స్వీకరించి త్రాగి నన్ను నా కుటుంబ సభ్యులను ఆశీర్వదించి వెళ్ళినారు. ఆయన వెళ్ళిన వెంటనే నా భార్య అన్న మాటలు "ఈ రోజు గురువారము శ్రీ సాయి హఫీజ్ బాబా రూపం లో వచ్చి మన యింట పాలు త్రాగి వెళ్ళినారు". ఆ మాటలు నన్ను చాలా సంతోషము కలిగించినాయి. మరి రాత్రి కలలో యిద్దరు పెద్ద మనుషులు నన్ను గోవా ఎందుకు తీసుకొని వెళ్ళినారు అని ఆలోచించినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 36 వ. అధ్యాయములో గోవాలోని యిద్దరు పెద్ద మనుషులలో ఒకరు 30,000/- రూపాయలు పోగుట్టుకొని మానసిక బాధ పడుతున్న సమయములో దారి వెంట పోతున్న ఒక ఫకీరు అతని దగ్గరకు వచ్చి ఓదార్చి అతని కష్ఠములు దూరము చేయుటకు షిరిడీకి వెళ్ళి శ్రీ సాయి దర్శనము చేయమని చెప్పిరి. నిన్నటిరోజున కుటుంబ వ్యవహారాలలో మానసిక బాధలో ఉండగా శ్రీ సాయి హఫీజ్ బాబా రూపములో ఈనాడు నా యింటికి వచ్చి నా మానసిక బాధలు దూరము చేయటానికి నన్ను ఆశీర్వదించినారు అని నమ్ముతాను.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Wednesday, December 14, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 5:26 AM













14.12.2011 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

కరెంట్ కోత, నెట్ కనెక్షన్ ప్రోబ్లెం వల్ల నిన్నటిరోజున ప్రచురించడానికి ఆటంకం కలిగింది.

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 10 వ.భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ - 1993

03.07.1993 శనివారము - గురుపూర్ణిమ

నిన్నటి రోజు ప్రశాంతముగా గడచినది. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, శ్రీ సాయినాధా ప్రతి గురుపూర్ణిమనాడు నీవు నా మనసుకు సంతోషము కలిగించుతున్నావు. తెల్లవారితే గురుపూర్ణిమ. నాలో నూతన ఉత్సాహాన్ని కలిగించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో నాకు ప్రసాదించిన దృశ్యము మరచిపోలేనిది. 1974 సంవత్సరములో నా తండ్రి మరణించినారు. ఆనాటినుండి నా తల్లి నుదుట కుంకుమ బొట్టు కరువు అయినది. మరి కలలో " నా తల్లినుదుట పెద్ద కుంకుమ బొట్టు, జడనిండ పూలుతోను పట్టు చీర కట్టుకొని నా తండ్రిగారి ప్రక్కన నిలబడి నన్ను ఆశీర్వదించి ఒక మోటార్ సైకిల్ బహుమతిగా యిచ్చినది. శ్రీ సాయి నా తల్లి రూపములో గురుపూర్ణిమకు ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయటానికి మోటార్ సైకిలు యిచ్చినారు అని భావించినాను. సాయంత్రము శ్రీ సాయినాధుని గుడికి వెళ్ళి శ్రీ సాయి యిచ్చిన సందేశాలు మొదటి భాగము (శిఖరాలు లోయలలో శ్రీ సాయి) శ్రీ సాయి పాదాలకు అంకితము చేసినాను. అక్కడినుండి నాటక రంగములో మంచి దర్శకుడు శ్రీ దీన్ బద్రు యింటికి వెళ్ళి శ్రీ సాయి పేరిట పట్టుకుండువా సమర్పించినాను. శ్రీ దీన్ బద్రుతో గడిపిన క్షణాలులో శ్రీ సాయితో మాట్లాడిన అనుభూతిని పొందినాను. ప్రతి గురుపూర్ణిమ శ్రీ సాయితో గడపాలి అనే కోరిక యెక్కువ కాసాగినది. భవిష్యత్ లోని గురుపూర్ణిమ అనుభూతుల కోసము వేచి చూడాలి.

25.07.1993 ఆదివారము

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి ఒక ఫకీరు రూపములో నాకు ఎదురు పడినారు. నేను వారికి ఎండు ఖర్జూరాలు తినటానికి యిచ్చినాను. ఫకీరు వాటిని ఆనప గింజలుగా మార్చి వేసి నాతో అన్నారు. "నీవు తినే ఖరీదు అయిన ఎండుఖర్జూరాల పోషక విలువను నేను ఆనప గింజలలో యిస్థాను. నమ్మకము ఉంటే స్వీకరించు" నేను సంతోషముగా ఆనపగింజలను స్వీకరించినాను. ఆయన నాతో మాట్లాడుతూ అన్నారు. నీలో యింకా మితృలు, శతృవులు అనే భావన పోలేదు ఆభావనకు దూరంగా ఉండు. సర్వకాల సర్వ అవస్థలయందు నన్నే స్మరించుతూ ఉండు" ఆనందముతో నిద్రనుండి మేల్కొనినాను చక్కటి దృశ్యము గురించి ఆలోచించుతూ ఉంటే శ్రీ సాయి సత్చరిత్రలోని 10 . అధ్యాయములో " బాబా ప్రతిజీవియందు దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే." మరియు వారు ఏనాడు తన భక్తులకు మంత్రోపదేశము చేయలేదు. "సాయి, సాయి" అను నామము జ్ఞప్తియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో మీ బంధములనుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. మాటలు తిరుగు లేని నిజాలు అని సాయి.బా.ని.. గా నమ్ముతాను.

28.07.1993 బుధవారము

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కారము చేసి ప్రశాంతముగా నిద్రపోయినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "నీతోటివానికి ఆకలి వేసినపుడు నీవు వానికి యింత అన్నము పెట్టు. అది నాకే చెందుతుంది". సంతోషముతో నిద్రలేచినాను. ఈరోజు నా కుమార్తెకు శ్రీమంతము. పేరంటాళ్ళు వచ్చి నా కుమార్తెను ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళినారు. వారు అందరు వెళ్ళిన తర్వాత నేను నాదూరపు బంధువు (నా భార్య పెదతల్లి కుమారుడు) కలసి భోజనము చేసినాము. సమయములో శ్రీ సాయి నా ప్రక్కన కూర్చుని భోజనము చేస్తున్న అనుభూతిని పొందినాను. సాయంత్రము వాన చినుకులు పడసాగినవి. యింటికి వచ్చిన బంధువులు అందరు వెళ్ళిపోయినారు. నేను నా భార్య వీధి అరుగుమీద కూర్చుని యున్నాము. యింతలో ఒక పెద్ద కుక్క మా ముందు నిలబడి నోరు తెరచి నాలిక వెనక్కి ముందుకు ఆడించుచున్నది. నా భార్య నన్ను చూసి బాబా వచ్చినారు అంది. నేను సంతోషముగా నీకు బాబా వచ్చినారు అనే నమ్మకము ఉంటే కుక్క రూపములో ఉన్న బాబాకు భోజనము పెట్టమని చెప్పినాను. నా భార్య ఆకులో పిండివంటలు, పెరుగు అన్నము తెచ్చి కుక్కకు భోజనము పెట్టినది. నాలో సంతోషము కలిగినది. శ్రీ సాయి సత్ చరిత్ర 42 . అధ్యాయములో శ్రీ సాయి - శ్రీమతి లక్ష్మీబాయి షిండేతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చినవి. " కుక్క ఆకలి తీర్చుట నాయాకలి తీర్చుటవంటిది. కుక్కకు కూడ ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము".

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List