Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 10, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 3:59 PM


11.12.2011 ఆదివారము


ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుబాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 8 వ.భాగము చదువుకుందాము.


సాయి.బా.ని.. డైరీ 8 . భాగము

29.05.1993

నిన్నటి రోజున శ్రీ సాయి సత్ చరిత్ర 51 . అధ్యాయము నిత్యపారాయణ పూర్తి చేసినాను. 51 . అధ్యాయము చదవటము పూర్తి చేసిన ప్రతిసారి శ్రీ సాయి లీలను చూడగలుగుతున్నాను. కాని నిన్నటి రోజున ఎటువంటి అనుభూతి కాని, లీలను కాని పొందలేదు. నిద్రకు ముందు శ్రీ శిరిడీ సాయికి నమస్కరించి కనీసము మంచి అనుభూతిని కలలో ప్రసాదించమని వేడుకొన్నాను. రాత్రి కలలో "నేను కాకినాడకు రైలులో చేరుకొన్నాను. కాకినాడ టౌన్ స్టేషన్ వెయిటింగ్ రూం దగ్గర చాలా మంది ఒకవరసలో నిలబడి లోపలికి వెళ్ళి శ్రీ సత్యసాయి (పుట్టపర్తి బాబా) పాదాలకు నమస్క్రరించుతున్నారు. నేను నా సామానులు ఒక స్నేహితునికి అప్పగించి వెయిటింగ్ రూం లోనికి వెళ్ళినాను. ఆయనను చూడగానే కాకినాడలో 1964 సంవత్సరములో ఒకరాత్రి కలలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చినది. 1964 సంవత్సరములో నాకు సాయి గురించి తెలియని రోజులలో శ్రీ సత్యసాయిని దూషించినాను. నేను సత్య సాయిని దూషించిన రోజు రాత్రి కలలో శ్రీ సత్యసాయి నా భుజముమీద చేయి వేయగానే నాకు విద్యుత్ శక్తి షాక్ కొట్టినది. ఈసారి నేను ఆయన పాదాలను తాకితే ఏమి జరుగుతుంది అనే ఆలోచనలతో నిలబడిపోయినాను. ఆయన చిరునవ్వుతో పాదపూజ చేసుకోమని చెప్పినారు. నేను సంతోషముగ ఆయన పాదపూజ చేసుకొన్నాను. పూజ అనంతరము ఆయన కేసి చూసినాను. కుర్చీలో శ్రీ సత్యసాయి బదులు శ్రీ శిరిడీ సాయి ఉన్నారు. నాకు వెంటనే మెలుకువ వచ్చినది. నిన్నటిరోజున 51 . అధ్యాయము చదవటము పూర్తి చేసిన సందర్భములో శ్రీ శిరిడీ సాయి నాకు యిచ్చిన అనుభూతి, సందేశము "నేను అందరు యోగులలోను ఉన్నాను" అనేది నిర్ధారింపబడినది. అనుభూతి గురించి ఆలోచించుతుంటే శ్రి సాయి సత్ చరిత్ర 12 . అధ్యాయములో నాసిక్ నివాసియగు మూలేశాస్త్రికి, శ్రీ సాయి ఘోలప్ స్వామి రూపములో దర్శనము యిచ్చి, మూలేశాస్త్రి పాదపూజ చేసుకొన్న అనంతరము తిరిగి శ్రీ సాయిబాబా లాగ దర్శనము యివ్వటము గుర్తుకు వచ్చినది. 33 . అధ్యాయములో హరి బావూ కర్లిక్ నుండి శ్రీ సాయి ఒక రూపాయి దక్షిణను నాసిక్ లోని కాలా రాముని మందిరములో నరసిం మహరాజు అనే యోగి రూపములో స్వీకరించటము ఆలోచించితే యోగీశ్వరులందరు ఒకటేయని, ఏకాత్మత భావముతో కార్యములొనర్తురని భావించినాను. శ్రీ శిరిడీసాయి తన భక్తుల మనసులోని భావాలను గుర్తించి వారికి అదే రూపములో దర్శనము యిచ్చి తాను అన్ని రూపాలలోను యున్నాను అనే నమ్మకము కలిగించి వారిని తన మార్గములో నడిపించుతారు. 1964 మరియు 1993 లలో నా భావనలో శ్రీ సత్యసాయి ఉండటము చేత శ్రీ శిరిడీ సాయి అదే రూపములో నాకు దర్శనకు యిచ్చినారు.

01.06.1993 మంగళవారము

నిన్నటిరోజున నా కుటుంబ పరిస్థితిపై ఆలోచించి విసిగిపోయినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆత్మహత్య చేసుకోవటానికి అనుమతిని ప్రసాదించమని కోరినాను. కలలో "శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి రెండు విషయాలు చెప్పినారు. మొదటిది కాకినాడలో నీ స్నేహితుడు శ్రీ కామేశ్వరరావు తన పిచ్చి భార్యతో సంసారములో బాధలు పడటము లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నాయా నీ సంసార బాధలు ఆలోచించు. రెండవది 1970 అక్టోబరు నెల 30 . తారీకున నీవు నూతనముగా నీ ఆఫీసు పనిలోనికి చేరడానికి ఆటొలో వస్తున్నపుడు ఆటొ ప్రమాదములో నీవంటి మీద ఒక్కదెబ్బకూడ తగలకుండ నిన్ను కాపాడుకొన్నది ఎందుకు? రోజున నీకు చావడానికి నేను అనుమతి ఇస్తానని ఎలాగ తలచినావు. నా చరిత్ర అన్ని సార్లు చదివినావే ఆత్మ హత్యపాపము అని నీవు యింకా తెలుసుకోలేదా" . నాకు మెలుకువ వచ్చినది. శ్రీ సాయి కలలో చెప్పిన రెండు విషయాలు వ్యతిరేకించలేని నిజాలు. కాకినాడలో నా స్నేహితుడు తన పిచ్చి భార్యతో చాలా మానసిక బాధలు పడుతున్నాడు. నాపరిస్థితి అతని పరిస్థితికంటే చాలా మెరుగు. యింక రెండవ విషయము 30.10.1970 నాడు మధ్యాహ్న్నము ఎన్.ఎఫ్.సీ. లో డ్యూటీకి జాయిన్ అవటానికి సికంద్రాబాద్ నుండి ఆటోలో బయలుదేరినాను. ఆటో మౌలాలి దగ్గర ఆర్. ఎఫ్. సీ. దగ్గర ఎలక్ట్రిక్ స్థంభానికి గుద్దుకొని తలక్రిందులయినది. ఆటో డ్రైవరుకు గాయాలు తగిలినాయి. నాకు ఒక్క దెబ్బకూడ తగలలేదు. మరి దీనిని బట్టి ఆలోచించితే 1970 లో నేను శ్రిరిడీ సాయి భక్తుడిని కాకపోయినా శ్రీ శిరిడీ సాయి నన్ను ఆటో ప్రమాదమునుండి రక్షించినారు అని నమ్ముతాను.

10.06.1993 గురువారము

నిన్న సాయత్రము నా భార్య పిల్లలతో గొడవ పడినాను. వారికి నేను సంపాదించిన ధనము కావాలి. అంతేగాని నా ప్రశాంత జీవనానికి సహకారము మాత్రము యివ్వరు. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నేను సంపాదించిన ధనము, కట్టిన యిల్లు, నా భార్య పిల్లలకు యివ్వటానికి సిధ్ధముగా ఉన్నాను. నేను సన్యాసము స్వీకరించ దలచినాను. నాకు అనుమతిని ప్రసాదించు తండ్రీ అని వేడుకొని రాత్రి 9.30 గంటలకు నిద్రపోయినాను. రాత్రి 10.30 గంటల సమయములో ఉండగా నా మంచము ప్రక్కన ఉన్న టెలిఫోన్ మ్రోగినది. తెలివి తెచ్చుకొని ఫోన్ ఎత్తినాను. పూనా నుండి నా తల్లి నాయోగ క్షేమాలు తెలుసుకోవాలనే ఆతృతతో ఫోన్ చేసినది. ఆమె ఫోన్ లో మాట్లాడుతుంటే సాక్షాత్తూ శ్రీ సాయినాధుడు నాతో మాట్లాడుతూ నా యోగక్షేమాలు తెలుసుకొంటు నామనసుకు ప్రశాంతత కలిగించిన అనుభూతిని పొందినాను. నా తల్లి మాట్లాడిన తర్వాత నా చెల్లెలు నా యోగక్షేమాలు అడుగుతూ మాట్లాడినది. సంతోషముతో శ్రీ సాయికి నమస్కరించి శ్రీ సాయి సత్చరిత్రలో నిత్య పారాయణగా 13 . అధ్యాయము చదివినాను. మొదటి పేరాలో శ్రీ సాయి అన్న మాటలు "నేను ఫకీరుని అయినప్పటికి, యిల్లు గాని భార్య గాని లేనప్పటికీ, ఏచీకూ చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకోలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లపుడు ఆమె నన్నావరించుచున్నది. భగవంతుని మాయ బ్రహ్మ మొదలగువారినే చికాకు పరుచునపుడు నావంటి ఫకీరనగ దానికెంత?" మాటలు చదువుతుంటే శ్రీ సాయి నన్ను సన్యాస ఆశ్రమము స్వీకరించవద్దు అనే సందేశము యిచ్చినారు అని భావించాను.

(యింకా ఉంది)


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Friday, December 9, 2011

72 గంటల సమాధి

0 comments Posted by tyagaraju on 4:05 PM

10.12.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు

రోజు నేటికి అనగా డిసెంబరు, 10, 2011 బాబావారి 72 గంటల సమాధి జరిగి 125 సంవత్సరములు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని, శ్రీ సాయి సత్ చ్ళరిత్రలోని 43, 44 అధ్యాయాలను మరొక్కసారి మననం చేసుకుందాము.

ఇటుకరాయి విరుగుట

బాబా భౌతికశరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకున మయ్యెను. మసీదులో ఒక పాత యిటుక యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థులగు చుండిరి. అనేక సంవత్సరము లిట్లు గడచెను. ఒకనాడు, బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చెతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయి పోయెను. ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి యిట్లని యేడ్చిరి. "ఇటుక కాదు, నా యదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడచినది." ఎవరైన ఒక ప్రశ్న నడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుకకోసమింత విచారపడనేల?" అందులకు హేమడ్ పంతు ఇట్లు సమాధాన మిచ్చెను. "యోగులు బీదవారికి, నిస్సహాయులకు సహాయముచేయుటకై యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు”.

72 గంటల సమాధి

ఇటుక విరుగుటకు 32 సంపత్సరములకు పూర్వమందు అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిరపౌర్ణమి నాడు బాబా ఊబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి దీసికొనిపోయి సమాధిలో నుంచవలెననుకొని, భక్త మహళ్సాపతితో నిట్లనిరి. "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము. నేను తిరిగి పచ్చినట్లయిన సరే, లేనియెడెల నా శరీరము నెదురుగా నున్న ఖాళి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము" అని స్థలమును జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడికూడ ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరివారందరచ్చట చేరి న్యాయవిచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహళ్సాపతి యడ్డగించెను. తన తొడపై బాబా శరీరము నుంచుకొని మూడురొజూలట్లే కాపాడుచు కూర్చుండెను.

3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి ఆడ నారంభించెను. కడపు కదలెను, కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను.





దీనినిబట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము, అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది, పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువు లన్నిటి యందు వ్యాపించి యున్నది. అది లేనిస్థలము లేదు. అది తాను సంకల్పించు కొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతికశరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి యెల్లప్పుడు ఉండు వారు. అట్లనే పూర్వము గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు. వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో
పూజించువారికిని అనుభవనీయమయిన సంగతి.

ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము షిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము మసీదులో నున్నది. దీనిని శ్యామారావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడూ నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతికశరీరముతో చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతికశరీరము లేనప్పిటికి వారక్కడనేకాక ప్రతి చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబావంటి యోగులు ఎన్నడు మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List