Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 3, 2011

బాబా ఇప్పించిన డ్రైవింగ్ లైసెన్స్

0 comments Posted by tyagaraju on 4:15 PM



04.11.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు

ఈ రోజు స్రవంతి రెడ్డిగారికి బాబా వారు చేసిన సహాయము గురించి, వారి అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము. ఈ అనుభవాన్ని సుకన్య గారు పంపించారు. సుంకన్యగారికి బాబావారి ఆసీస్సులు.


బాబా ఇప్పించిన డ్రైవింగ్ లైసెన్స్


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కి జై


మూడు వారాల కిందటే నేను ఈ అనుభవాన్ని మీకందరికీ తెలియచేయనందుకు బాబాని మొదటగా క్షమాపణ వేడుకుంటున్నాను.

డిసెంబరు 2008 లో నేను అమెరికా వచ్చాను. అప్పుడు నేను సెంట్ లూయీస్ లో ఉండేదానిని. మా చుట్టుప్రక్కలవాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నా భర్తని డ్రైవింగ్ ఆఫీసుకు తీసుకువెళ్ళమని అడిగాను. 6 నెలల తరువాత సెంట్ లూయిస్ లో ఉన్న డీ ఎం వీ ఆఫీసుకు తీసుకునివెళ్ళారు. మొదటి ప్రయత్నం లోనే రాత పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాను. 6 నెలల వరకు పెర్మిషన్ వచ్చింది. డ్రైవింగ్ క్లాస్ 5 గంటల సేపు తీసుకుందామనుకున్నాను. ఆ సమయలో నా భర్త మరో ఉద్యోగంలోకి ప్రవేశించడంతో మేము కనెక్టి కట్ ( సీ టీ) కు మారాము. మేము డీ ఎం వీ ఆఫీసుకు వెళ్ళాము. నేను నా పెర్మిట్ ని చూపించి డ్రైవింగ్ టెస్ట్ కి అప్పాయింట్ మెంట్ ఇమ్మనమని అడిగాను. ఒక రాష్ట్రం లో తీసుకున్న పెర్మిట్ మరొక రాష్ట్రం లో చెల్లదని డీ ఎం వీ ఆఫీసులో వారు చెప్పారు. వారు మమ్మలిని సీ టీ రాష్ట్రం నించి పెర్మిట్ తెచ్చుకోమని చెప్పారు. ఇక్కడ పధ్ధతి చాలా వేరుగా ఉంటుంది. అయితే మేము ఏమిచేయాలో వివరంగా చెప్పమని అడిగాము. సీ టీ లో 8 గంటలు క్లాసులు తీసుకోవాలని చెప్పారు. (మొదటగా తప్పనిసరిగా తీసుకోవలసిన మొదటి క్లాసుకు 125 డాలర్ లు) (ఇది ఏ రాష్ట్రం లోను అవసరం లేదు) ఇక్కడ నా భర్తకు 3 మాసాలకు మాత్రమే ప్రాజెక్ట్ వచ్చింది. అందుచేత నేను 3 నెలల తరువాత యింకొక రాష్టం నించి లైసెన్స్ తెచ్చుకుందామని నిర్ణయించుకున్నాను. తరువాత మేము కొన్ని అనివార్య కారణాలవల్ల యిండియాకు వచ్చి మరలా 2 నెలల తరువాత అమెరికాకు తిరిగి వచ్చాము. నా భర్తకు సీటీ లొ ప్రాజెక్ట్ మరొక సంవత్సరంపాటు పొడిగించారు. అందుచేత జూలై 2011 లో నేను 8 గంటల క్లాసులకి ఒక వారం రోజులు హాజరయ్యాను. 8 గంటల క్లాసులు పూర్తయిపోయినతరువాత నా భర్తకి మరొక రాష్ట్రంలో యింకొక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. నాకు చాలా నిరాశ వేసి క్లాసులకి ఎందుకిలా ఆటంకాలు కలుగుతున్నాయని బాబా ని అడిగాను.

కొత్త కంపనీ వారు మాకు విసా కోసం ప్రయత్నించడం మొదలెట్టారు. ఇక్కడ నేను ఒక నెలపాటు రాతపరీక్షకి హాజరవలేదు.

నా భర్త నన్ను రాత పరీక్షకు హాజరవ్వమని బలవంత పెట్టారు. మొదటిప్రయత్నం లోనే నేను పాసయ్యాను. మెల్లగా నేను నా భర్తతో కలిసి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా భర్త నాకు ఎంతో ఓర్పుతో నెలరోజులపాటు డ్రైవింగ్ నేర్పారు. డ్రైవింగ్ స్కూల్ లో నేను క్లాసులకు వెళ్ళలేదు. సెప్టెంబరు 2011, 23 తారీకున నాకు అప్పాయింట్ మెంట్ దొరికింది. ఒక వారము ముందు అక్టోబరు 5 తారీకుకి (బుధవారము) రీషెడ్యూల్ చేయించుకున్నాను. అనుకోకుండా, కారు పార్క్ చేయడం యింకా మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోయాను. సహనం నశించి నేనిక ఎప్పటికీ పరీక్ష పాసవలేనని నా భర్త అన్నారు. నాకు దారి చూపమని బాబా ముందర నిలబడి వేడుకున్నాను. బాబా దయ వల్ల అక్టోబరు 5 కు ముందు నేను మరలా బాగా నేర్చుకున్నాను.

అక్టోబరు 5 తారీకున బాబా కి నమస్కరించి పరీక్షకు వెళ్ళాను. ఆరోజున నాకు చాలా ఆందోళనగా ఉంది. పరీక్ష నిర్వాహకుడు వచ్చేముందర డీ ఎం వీ ఆఫీసులో బాబాని ప్రార్థిస్తూ కూర్చున్నాను. ఒకవేళ నేను పరీక్షలొ సరిగా చేయలేక నన్ను ఫెయిల్ చేసే పరిస్థితే కనక వస్తే ఆరోజుకు పరీక్ష లేకుండా తప్పించమని బాబాని వేడుకున్నాను. అప్పుడు పరీక్ష నిర్వహించే అధికారి వచ్చి మా కారును అంతా పరీక్షించి ఒక లోటు కనిపెట్టారు. (యైర్ బాగ్ లైట్ వెలుగుతూ ఉంది). అందుచేత సమస్య లేకుండా మరలా తరవాత రమ్మనమని చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోయాము.

నా భర్త మరొక కొత్త కారును కొనే ఆలోచనలో ఉన్నారు. బాబా దయ వల్ల అక్టోబరు 15 తారీకున (పుణ్య తిథి) కొత్త కారు కొనుక్కున్నాము. మరలా నవంబరు,2011, 3 వ.తారీకున నాకు అప్పాయింట్ మెంట్ ఇచ్చారు (గురువారము). ఆరోజు బాబా రోజు కాబట్టి బాబాయే నాకు అప్పాయింట్ మెంట్ వచ్చేలా చేశారని నాకు చాలా ఆనందం వేసింది. కారు కూడా బాబాదే.

సంఘటనలన్నీ గురువారమునాడే జరుగుతున్నాయి. కొత్త కంపెనీ నించి విసా వచ్చింది. మేము సీటీ రాష్ట్రం నించి నవంబరు మధ్యలో వెళ్ళిపోవాలి. ప్రతీ గురువారమునాడు నేను ధూప్ హారతి ఇస్తున్నాను. ఆరోజు నేను కాకడ హారతి ఇచ్చి పరీక్షకు వెళ్ళాను. ఎగ్జామినర్ వచ్చి మా కారును పరీక్షించాడు. నేను మా కారులో బాబా సత్ చరిత్రను ఉంచి (బాబా కారు) కారులో ఉన్న బాబా ఫొటోకు నమస్కరించి కారు నడపడం మొదలుపెట్టాను. అంతా సవ్యంగానే చేసాను కాని ఒక్క చిన్న పొరపాటు మాత్రం చేశాను. ఈ పరీక్షలో నాకు లైసెన్స్ వచ్చేలా చేయమని బాబాని ప్రార్థించాను.


టెస్ట్ అయిపోయిన తరువాత ఎగ్జామినరు కారు నడిపినప్పుడు నేను ఎలా చేశానో ప్రతీదీ వివరంగా చెప్పి ఆఖరికి పాస్ కాలం లో టిక్కు పెట్టాడు. ఆ క్షణంలో నేను సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పాను. బయట వేచి చూస్తున్న నా భర్త కూడా ఎంతో సంతోషించారు. బాబా అనుగ్రహం వల్ల నాకు 7 సంవత్సరాల వరకు చెల్లేలా బ్రిడ్జ్ పోర్ట్ లో లైసెన్స్ వచ్చింది. (మొదటి ప్రయత్నం లోనే ఇక్కడ లైసెన్స్ రావడం చాలా కష్టం.)

థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నేను నిన్ను ఎంతగానో ఆరాధిస్తున్నాను. దానికి అవధులు లేవు.


స్రవంతీ రెడ్డి
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Friday, December 2, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 6:26 AM

02.12.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 4 వ. భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ 4 వ. భాగము


03.03.1993 బుధవారము

శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారము అని శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఉపోద్ఘాతములో చక్కగా వివరించినారు. అయినా నా మనసులో ఎక్కడో ఒక మూల ఫకీరు అనే భావన నిలిచిపోయింది. ఈ భావనను తొలగించటానికి నిన్నరాత్రి శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలోని భావాలను మార్చి వేసినది. నేను పని చేస్తున్న అతుకు లేని తుప్పు పట్టని (స్టైన్ లెస్ స్టీలు) గొట్టాల తయారీ కర్మాగారాన్ని చూపించినారు. మా ఫ్యాక్టరీకి లారీలలో స్టైన్ లెస్ స్టీలు మూల పదార్థముగా యున్న ఉక్కు దిమ్మలు వస్తున్నాయి.

అవి అన్నీ ఆఖరికి ఉక్కుగొట్టాలగా మారి పోయి తిరిగి లారీలలో ఫ్యాక్టరీనుండి బయటకు వెళ్ళిపోతున్నాయి. యింకొక దృశ్యములో బంగారు దిమ్మలు వస్తున్నాయి అవి ఆభరణాలుగా మారిపోతున్నాయి. ఒక ఆభరణానికి పాదరసము పూయబడినది. ఆ ఆ ఆభరణము బంగారపు రంగును కోల్పోయి తెల్లని రంగులో మెరుస్తున్నది. కొందరు దానిని బంగారు ఆభరరణము అంటున్నారు. మరికొందరు అది సత్తు ఆభరణము అని అంటున్నారు. కాని కంసాలివాడు వచ్చి అది సత్తు ఆభరణము కాదు అది బంగారు ఆభరణము అన్నారు. నాకు మెలుకువ వచ్చినది ఈ దృశ్యముతో నేను పొందిన అనుభూతి ఏమిటి ఒక్కసారి ఆలోచించినాను. నా దృష్ఠిలో శ్రీ సాయి బంగారు ఆభరణము, ఫకీరు అవతారము అంటే బంగారు ఆభరణానికి పాదరసము పూయటము నాదృష్టిలో. ఆ కంసాలి హేమాద్రిపంతు. మనము అందరము సాయి అవతారాన్ని (దత్తాత్త్రేయ అవతారాన్ని) హేమాద్రిపంతు గుర్తించిన విధముగా గుర్తించాలి.

05.03.1993 శుక్రవారము

నిన్నటి రాత్రి శ్రీ సాయి చక్కని దృశ్యాన్ని ప్రసాదించినారు. ఆదృశ్యములో ఒక ముసలివాడు తిరగలిలో గోధుమలు పిండిగా విసరుతున్నాడు. అతనికి తినటానికి కావలసినదాని కంటే కొంచము ఎక్కువ గోధుమ పిండిని విసరినాడు. ఆయన నన్ను ఉద్దేశించి అన్నారు, "నీవు సంఘము అనే తిరగలిలో గోధుమలులాగ విసరబడి - పిండిగా మారి నా భక్తులకు రొట్టెగా మారాలి". ఒక్కసారి ఉలిక్కిపడి లేచినాను. ఆ మాటలు చెవిలో యింకా వినిపించుతున్నాయి. శ్రీ సాయి సత్ చరిత్రలో 1 వ. అధ్యాయములో గోధుమలు విసరుట దాని వేదాంత భావమును చక్కగా వివరించబడినది. శ్రీ సాయి నిన్నరాత్రి కలలో స్వయముగా గోధుమలు విసరుటలోని వేదాంత భావమును స్వయముగా నాకు వివరించినారు అని నా నమ్మకము.

06.03.1993 శనివారము

నిన్న రాత్రి శ్రీ సాయి నా జీవిత పరిస్థితి చక్కగా కలలో దృశ్య రూపములో చూపించినారు. నేను రిక్షా తొక్కుతున్నాను. నా రిక్షాలో నా భార్య పిల్లలు కూర్చుని యున్నారు. వాన విపరీతముగా పడుతున్నది. రోడ్డుమీద గోతులు అన్నీ నీళ్ళతో నిండిపోయి రోడ్డు సరిగా కనిపించటములేదు. నేను రిక్షాను అతి కష్టము మీద త్రొక్కుతున్నాను.



పిల్లలకు చికాకు వేసి వాళ్ళు రిక్షా దిగి వెళ్ళిపోయినారు. నా భార్య నన్ను జాగ్రత్తగా రిక్షా త్రొక్కమని వెనుకనుండి సలహాలు యిస్తున్నది. నాలో నీరసము వస్తున్నది. నా రిక్షా వెనుక ఒక రిక్షాను మా ఫ్యాక్టరీలో పని చేస్తున్న శ్రీ బాష అనే కార్మికుడు త్రొక్కుతున్నాడు. అతడు నా పరిస్థితిని చూసి నాపై ప్రేమతో నా రిక్షాను వెనుకనుండి త్రోస్తూ గతుకులు లేని రోడ్డు మీదకు నన్ను నాభార్యను - నా రిక్షాను చేర్చినాడు. నిన్నటి రాత్రి కలను అర్థము చేసుకొన్నాను. శ్రీ సాయి సత్ చరిత్ర 6 వ. అధ్యాయములో "సద్గురుని సహాయము తో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో మనము మన గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును". ఈ విషయాన్ని దృశ్యరూపములో శ్రీ సాయి నాకు తెలియ చేసినారని గట్టిగా నమ్ముతాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

(ఇంకా ఉంది)


Thursday, December 1, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 7:57 AM



01.12.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి బానిస డైరీ 1993 -- 3 వ.భాగము చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ 22.02.1993

ఈ రోజు రాత్రి 9 గంటలకు టీ.వీ. లో "ఫర్మాన్" ఉర్దూ సీరియల్ వచ్చినది. ఆ నాటకంలో యజమాని ముస్లిం నవాబు. అతని దగ్గర మేనేజరు హిందువు. ఆ నాటకము చూస్తూ ఉండగా శ్రీ సాయి నా మనసులో మెదలినారు. హిందూ ముస్లింల ఐకమత్యమునకు దోహదపడే మాటలు వినిపించచేయమని శ్రీ సాయిని ప్రార్థించినాను. సుమారు 20 నిమిషాల తర్వాత యజమానురాలు (ముస్లిం వనిత) తన హిందూ పనివాళ్ళతో అంటున్న మాటలు "శ్రీ రామ నవమినాడు గుడిలోని గంటల శబ్దము - మశీదులోని ప్రార్థనలు ఒకటిగా వినిపించితే ఎంత సంతోషముగా యుంటుంది" నన్ను ఆనంద పరవశములో ముంచెత్తినాయి. శ్రీ సాయి సత్ చరిత్ర 6 వ.అధ్యాయములో "బాబా శ్రీరామనవమి రోజున ముస్లింల చేత చందన ఉత్సవము జరిపించినారు." వారు హిందూ, మహమ్మదీయుల మైత్రికి ఈ విధముగా చేసియున్నారు అని నేను గట్టిగా నమ్ముతాను.

27.02.1993 శనివారము

నిన్నరాత్రి నిద్రలో శ్రీ సాయి చక్కని దృశ్యాన్ని చూపించినారు. ద్వారకామాయిలోని స్థంభము చుట్టూ తూనీగలు చక్కగా ఎగురుతున్నాయి. వాటి కాళ్ళకు తేలికపాటి చొప్ప పుల్లలు కట్టబడియున్నాయి. అందువలన ఆ తూనీగలు అన్నీ ఒకే వరసలో ఒకే ఎత్తులో చక్కగా ఎగురుచున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి ఆ స్థంభము దగ్గర నిలబడి అన్నారు " మనసు ఇష్ఠము వచ్చినట్లు ఎగిరే తూనీగ, దానిని ఒక పధ్ధతిలో ఎగరనీయాలి అంటే గురువు మీద నమ్మకము అనే చొప్పపుల్ల దాని కాళ్ళకు కట్టాలి. అపుడు అది ఒక పధ్ధతిలో ఎగురుతూ మనిషికి మంచి నడవడిక ప్రసాదించుతుంది". ఈ దృశ్యాన్ని తలచుకొన్నపుడు శ్రీ సాయి ద్వారకామాయిలో నిలబడి తన భక్తుల మనసుకు నిలకడను ప్రసాదించుతున్నారని భావించినాను.

02.03.1993 మంగళవారము

నిన్న రాత్రి నిద్రలో శ్రీ సాయి చక్కని దృశ్యము ప్రసాదించినారు. కమలానగర్ లోని (నా యింటిదగ్గర) చర్చిలోనికి వెళ్ళినాను. అక్కడ భక్తులు "ఏసునాధుని భజన చేయుదము రారండి" అని పాటపాడుతున్నారు. నేను మాత్రము మెల్లిగా "సాయినాధుని భజన చేయుదము రారండి" అని పాడుతున్నాను. భజన తర్వాత ఆ చర్చిలో గొప్ప, బీద, అనాధ పిల్లలు అందరు కలసి భోజనము చేస్తున్నారు. అందరి కంచాలలోను రొట్టి, వంకాయ కూర వడ్డించినారు. నా మనసులో శ్రీ సాయికి వంకాయ కూర చాల ఇష్ఠము కదా అనే భావన కలిగినది. నా ప్రక్కన ఓ అనాధ బాలిక కూర్చునియుంది. నేను వంకాయ కూరను రొట్టెముక్కలో పెట్టి ఆ చిన్న పిల్ల నోటికి అందించినాను. ఆ పిల్ల రొట్టె తింటు సాయినాధుని రూపములో దర్శనము యిచ్చినది. ఆ చర్చి ద్వారకామాయిగా మారిపోయినది. ఒక్కసారి ఆనందముతో నిద్ర లేచినాను. యిది అంతా కలకదా ఎంత మంచి కల అని భావించినాను. ఉదయము స్నానము చేసిన తర్వాత శ్రీ సాయి సత్ చరిత్ర నిత్యపారాయణ ప్రారంభించినాను. 9 వ. అధ్యాయము పారాయణ ప్రారంభించినాను. "బాబాకు వంకాయ పచ్చడి చాల రుచిగా ఉండెను. కాన దానినందరికి పంచిపెట్టెను. తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను." ఈ మాటలు చదువుతుంటే నిన్న రాత్రి కలలో శ్రీ సాయి చర్చిలో (ద్వారకామాయి) వంకాయ కూర అందరికి పంచిపెట్టి తాను సర్వ దేవతా స్వరూపుడునని మరొక్కసారి ధృవపరచినారు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Wednesday, November 30, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 6:45 AM



30.11.2011 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 రెండవభాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ 1993 రెండవ భాగము

02.02.1993 మంగళవారము

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి వృధ్ధ వైద్యుని రూపములో రోగుల సేవ చేస్తున్న దృశ్యము ప్రసాదించినారు. ఆయన దగ్గర నర్సులు రోగుల బొటన వ్రేలికి యింజక్షన్ ఇస్తున్నారు. నా భార్యకూడ నర్సులతో చేరి అనారోగ్యముతో ఉన్న వారి బొటన వ్రేలికి యింజక్షన్ ఇస్తున్నది. నేను ఒక గదిలో కూర్చుని సాయి సందేశాలు పుస్తక రూపములో వ్రాస్తున్నాను. నా చేతి వేళ్ళకు కన్నాలు పడిపోయినాయి. రక్తము కారటము లేదు. ముసలి డాక్టరు నా చేతులు పట్టుకొని నిమురుతున్నారు. నేను ఆయన పాదాలకు నమస్కరించుతున్నాను. ఆయన నాపాదాలు మాలీషు చేస్థున్నారు. నేను అలాగ చేయవద్దు అన్నాను. ఆయన పరవాలేదు అన్నారు. యింతలో మెలుకువవచ్చినది. విధమైన కలరావటము శ్రీ సాయి సత్ చరిత్రలో 7 . అధ్యాయములో "తొలి దినములలో బాబా తెల్లపాగ, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితో నిచ్చిన మందులు పని చేయుచుండెడివి.. మంచి హస్త వాసిగల డాక్టరని పేరు వచ్చెను." అనే మాటలు మరియు 27 . అధ్యాయములో శ్రీ దాదా సాహేబు ఖాపర్డే భార్య శ్రీ సాయి పాదాలను తోముచున్నపుడు శ్రీ సాయి ఆమె చేతులను తోముట ప్రారంచించటము గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకొనుచున్నారు అని శ్యామ అనటము జ్ఞాపకానికి వచ్చినవి.

04.02.1993 గురువారము

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయి ఏకాలము నాటివారు? వారి అసలు రూపము ఏమిటి? అనే పరి పరి ఆలోచనలతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. రాత్రి కలలో నేను చూసిన దృశ్యము - అది నిర్మలమైన ఆకాశము అక్కడ మేఘాలు లేవు, నక్షత్రాలు లేవు. సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. అంతా కాంతివంతమైన విశ్వము. నా కన్నులతో ఆకాంతిని చూడలేకపోతున్నాను. ఒక్కసారి ఉలిక్కిపడి లేచినాను. శ్రీ సాయి అసలు రూపాన్ని నేను చూడలేని స్థితిలో ఉన్నాను అనే బాధ నన్ను వేధించసాగినది. తిరిగి శ్రీ సాయి పటానికి నమస్కరించి సాయినాధా నేను అర్థము చేసుకోగల స్థితిలో నీ అసలు రూపాన్ని చూపించు తండ్రీ అని వేడుకొని నిద్రపోయినాను. సారి శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినది. శ్రీ సాయి నాకు జన్మ యిచ్చిన నా తల్లి రూపములో దర్శనము యిచ్చినారు. నా తల్లి రూపములో ఉన్న శ్రీ సాయి పాదాలకు నమస్కారము చేసినాను. నిద్రనుండి మెలుకువ వచ్చినది. కలలోని దృశ్యాలను తలచుకొంటుయుంటే 28 . అధ్యాయములో శ్రీ సాయి మేఘశ్యాముని ఉద్దేశించి అన్న మాటలు " ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరములేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను." గుర్తుకు వచ్చినవి. కాంతివంతమైన విశ్వము అంత శ్రీ సాయి రూపము అని నేను గట్టిగా నమ్ముతాను. మరి శ్రీ సాయి నా తల్లి రూపములో దర్శనము యిచ్చి నీకు జన్మ యిచ్చిన మాతృమూర్తిని నేను" అని అన్నారు. అది నా అదృష్టము.

20.02.1993 శనివారము

నిన్నటి రోజున నా గత జీవితములో నాతో శారీరిక సంబంధము కలిగిన పర స్త్రీలు తమతో స్నేహము కొనసాగించమని ఆహ్వానము పంపినారు. మనసు చలించినది. శ్రీ సాయి తత్వములో పరస్త్రీ వ్యామోహము మహాపాపము. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి యిటువంటి పాపపు ఆలోచనలనుండి నన్ను దూరముగా ఉంచమని నా తప్పులను క్షమించమని వేడుకొన్నాను. శ్రీ సాయి దయామయుడు. నాలోని పరస్త్రీ వ్యామోహము ఎంతటి ఘోర పరిణామాలకు దారి తీస్తుంది చూపించి, నాలో మార్పు కలిగించినారు. వాటి వివరాలు. నేను మా ఫ్యాక్టరీలోని పెద్ద కొలిమి దగ్గర నిలబడినాను. కొలిమిలో 1100 డిగ్రీల సెంటీ గ్రేడ్ వేడి ఉంది. భయంకరమైన మంటలు యున్నాయి. మంటలు నీలి రంగులో అందముగా యున్నాయి.



అందమును చూచి నీలి రంగు మంటలో చేయి పెట్టినాను. చేయి కాలిన బాధతో కొలిమి (ఫర్నేసు) దగ్గర మలమూత్ర విసర్జన చేసినాను. యింతలో శ్రీ సాయి శ్రీ సాంబశివరావు అనే కార్మికుడు రూపములో వచ్చి మీరు పెద్దవారు ఆన్నీ తెలిసినవారు, మంటలో చేయి పెట్టవచ్చా అని అడిగి నా చేతికి చీపురు కట్ట ఇచ్చి మీరు విసర్జించిన మలమూత్రాలను శుభ్రముగా కడిగి వాటిని దూరముగా పారవేయండి అన్నారు. విధమైన దృశ్యము కలలో చూసి ఉలిక్కిపడి నిద్రనుండి లేచినాను పరస్త్రీ వ్యామోహము భయంకరమైన వేడి కలిగిన కొలిమిలాంటిది. కొలిమి (ఫర్నేసు) లో చేయి పెట్టితే చేయి కాలినది. చేయికాలిన తర్వాత పరస్త్రీ వ్యామోహము మల, మూత్రముల రూపములో విసర్జించబడినది. వాటిని శుభ్రము చేసుకొని జీవితములో తిరిగి పరస్త్రీ వ్యామోహము గురించి ఆలోచించరాదని నిశ్చయించుకొన్నాను. శ్రీ సాయి సత్ చరిత్రలో 14 . అధ్యాయములో "మనపారమార్ధికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది పరస్త్రీ. రెండవది ధనము. పరస్త్రీ వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకొనేందుకు శ్రీ సాయి తమ భక్తులను "బడికి" (రాధాకృష్ణమాయి గృహమునకు) పంపేవారు. ధనముపై వ్యామోహము ఉన్నది లేనిది తెలుసుకొనేందుకు దక్షిణగా ధనమును అడిగి పుచ్చుకొనేవారు. అనేది నిజము అని నమ్ముతాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List