Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, November 4, 2011

సాయి - తోడూ నీడ

0 comments Posted by tyagaraju on 8:35 AM




04.11.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి - తోడూ నీడ

ఈ రోజు నెల్లూరునించి సుకన్య గారు సేకరించి పంపిన భరనిజ గారి బాబా లీలను తెలుసుకుందాము. ఇది చదివిన తరువాత, ఎటువంటి కష్టము ఎదురైనప్పటికీ మనము సాయిబాబాని మరచిపోకూడదనీ, ఓర్పుతో ఉండాలనీ గ్రహించుకోవాలి.
సాయిభక్తులందరికీ ఆనందాన్నిచ్చే ఒకటే మాట సాయిబాబా.
మనము ఆయన వైపు ఒక అడువువేస్తే ఆయన మనవైపు తప్పకుండా పది అడుగులువేస్తారు. మన జీవితాంతమూ ఆయన తన చేతిలో మనచేయిని ఉంచుకుని, కూడా తనతో మన తల్లిలాగ మనలని నడిపిస్తారు. నా జీవితంలో అనేక సందర్బాలలో నేనాయన ఉనికిని అనుభూతిని చెందాను. నేనెప్పుడు తలుచుకున్నా నా శరీరం రోమాంచితమయ్యేటటువంటి ఒకనొక అనుభూతిని మీతో పంచుకుంటాను.

నేను డిగ్రీ చదివే రోజులలో హాస్టలులో ఉండేదానిని. నా పక్కనున్న గదిలో ఆంధ్ర ప్రదేశ్ నించి వచ్చిన విద్యార్థులు ఉండేవారు. వారు సాయిబాబాను పూజిస్తూ ఉండేవారు. ఇది 2001 సంవత్సరములో జరిగింది. అప్పట్లో నాకు సాయిబాబా గురించి తెలీదు. బాబా ఎంతో శక్తిమంతులనీ, మంచి దయగలవారనీ చెప్పారు. వారు తమ ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఒక బాబా ఫోటో తెమ్మని అడిగాను. రెండు రోజుల తరువాత నా స్నేహితుడు నా పుట్టినరోజుకు బహుమతీ తెచ్చి, అది నాకు నచ్చుతుందో లేదో తనకు తెలియదని చెప్పాడు. నాకు తెలుపురంగులో ఉన్న చిన్న బాబా విగ్రహాన్ని చూపించాడు. అది చూడగానే నాకెంతో సంతోషమయింది. నేను బాబా ఫోటో తెమ్మని నా ఆంధ్రా స్నేహితులని అడిగినట్లు చెప్పాను. బాబా గురించి ఆలోచిస్తే చాలు ఆయనే మనవద్దకు వస్తారని నా స్నేహితుడు అన్నాడు.

రోజులు గడిచిపోయాయి. బాబా అనుగ్రహంతో నేను పీ.జీ. లో చేరాను. నేనున్న హాస్టలు గదిలో బాబా విగ్రహాన్ని పెట్టుకున్నాను. దగ్గరలో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉండేదానిని. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నేను బాబాని ప్రార్ధించేదానిని. కాని అవేమీ తీరలేదు. నాకు చాలా నిరాశ ఎదురయింది. దానినించి బయటపడటానికి నాకు చాలా కాలం పట్టింది. నా పీ.జీ. చదువు అయినతరువాత మా కుటుంబమంతా వేరే ఊరికి మారాము. మా పాతయింటిలో బాబాని వదలివేసి, సంవత్సరం న్నరపాటు బాబాని పూజించటం మానేసాను. నాకష్టాలేమీ తీరకపోవడంతో నేను చాలా విసిగిపోయాను.

2007 వ సంవత్సరములో ఒక రోజు నేను డ్రైవ్ చేస్తూ నాకీకష్టాలన్ని ఎప్పుడు తీరతాయా అని ఆలోచిస్తూ ఉన్నాను. హటాత్తుగా నాముందు బాబా కనపడ్డారు. నా కారుముందు వెడుతున్న వాను వెనకవైపు చిరునవ్వుతో ఉన్న బాబా ఫొటో ఉంది. నాకప్పుడు నా తప్పు తెలిసివచ్చింది. మా అమ్మ వారాంతములో పాత యింటికి వెడుతున్నది కాబట్టి అక్కడ నేను వదలిపెట్టిన బాబా విగ్రహాన్ని తెమ్మనమని చెప్పాను. మా అమ్మగారు బాబా విగ్రహాన్ని పాత యింటినించి తీసుకుని వచ్చారు. అదే రోజు రాత్రి ఆయన నా కలలోకి వచ్చారు. ఆ కలలో నేను మేడమెట్లమీద నుంచుని నా స్నేహితునితో మాట్లాడుతున్నాను. బాబా గారు విచార వదనంతో మెట్లుఎక్కుతూ నావైపు వస్తున్నారు. నేను వెంటనే ఆయనవైపుకు వచ్చి ఏంజరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాటన్నారు, "నువ్విలా ఎందుకు చేస్తున్నావు"? అని. నేను వెంటనే నిద్రనుండి లేచి నేను చేసిన పెద్ద తప్పుకు ఆయనని క్షమించమని వేడుకున్నాను. బాబాని మరలా పూజించడం మొదలుపెట్టాను. తరువాత నాకు తీరవలసినవాటిని బాబా ఎందుకని తీర్చలేదో అర్థమయింది. నిజానికి నన్నాయన వాటినుంచి రక్షించారు.

చాల సందర్బాలలో నేనాయన ఉనికిని అనుభూతి చెందాను. ఒక గురువారమునాడు నేను బాబా గుడినించి వస్తూండగా నాకు ప్రమాదం జరిగింది. ఒక కారు నన్ను గుద్దుకుని దాదాపు 15 అడుగులవరకు నన్ను ఈడ్చుకుపోయింది. కాని నాకు భుజమువద్ద కాలి వద్ద బెణికి, ప్రమాదం నించి బయటపడ్డాను. గుళ్ళోనించి వచ్చే భక్తులంతా కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగిందనీ నాకు ప్రాణం పోయే ఉంటుందని అనుకున్నారు. గుడిపూజారిగారు నాకు తీర్ధం ఇచ్చి సాయి ఫొటోని ఇచ్చారు. నేనీరోజు బతికి ఉన్నానంటే బాబా అనుగ్రహమే. గురువారమునాడు నా సమస్యలకి సమాథానం కోసం సాయిబాబా సమాథానాలు చదివాను. నా సమస్యలేమీ తీరనప్పటికీ, బాబా నాతోడుగా ఉన్నారనీ ఆయనే నా సమస్యలన్నిటినీ తీరుస్తారనే నమ్మకం నాకుంది. నాకాయనయందు నమ్మకం ఉంది. బాబా ఇప్పుడు మనందరి మధ్యనే ఉండి మనం మాటలాడేవి, మనం చేసే పనులు అన్నీ గమనిస్తున్నారు. మంచి చేయండి. ఆయన ప్రేమని పొందండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Thursday, November 3, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

0 comments Posted by tyagaraju on 7:27 AM




03.11.2011 గురువారము

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు.

కూర్పు : : సాయి. బా. ని. స.

76. జీవితములో శ్రీ సాయి కవచములేనపుడు పొందిన అవమానాలు, పగ, వైషమ్యాలు - శ్రీ సాయి కవచము ధరించిన తర్వాత పొందిన విజయాలతో నీవు సులువుగా మర్చిపోగలవు. శ్రీ సాయి కవచము ధరించినవారికి ప్రతీకార ఇచ్చ ఉండదు అని గ్రహించు.

24.09.94

77. జీవితములో నీకు సహాయము చేసినవారు, వారి యింట శుభకార్యాలలో భోజనము చేయటానికి ఆహ్వానము వచ్చిన, సంతోషముగా వెళ్ళి భోజనము చేయి. ఆ విధముగా పిలిచినవారు నీకంటే గొప్పవారా లేక బీదవారా అని మాత్రము ఆలోచించకు.

17.10.94

78. జీవితములో మనకు కష్టము, సుఖము కలిగినపుడు ఆ కష్టసుఖాల వెనుక యున్న శక్తి గురించి ఆలోచించుతూ ఉంటాము. ఆ ఆలోచనలనే మతము అంటాము. భగవంతుని గురించి తెలుసుకోవటానికి మతము చాలా అవసరము.

06.09.97

79. జీవితము అనే పొలములో అజ్ఞానము అనే కలుపు మొక్కలను తీసివేయుట నావంతు. ఇక మిగిలిన జ్ఞానము అనే మొక్కలను పెంచి పెద్ద చేయుట నీవంతు.

26.09.97

80. జీవితములో మమతలు, మమకారాలు, మనమన్సుకు సంతోషము, విచారము కలిగించటానికే పరిమితము అయినవి. అటువంటి సంతోషముతో మనకు లభించేది ఏమీలేదు. ఆ విచారములో మనకు పోయినది ఏమీ లేదు. అటువంటప్పుడు మమతలు, మమకారాలు మధ్య కొట్టుమిట్టు ఆడటములో అర్ధము లేదు.

17.11.97

81. జీవితములో మనము తప్పుడు పనులు చేస్తున్నామని గ్రహించిన తర్వాత కూడ తప్పుడు పనులు చేస్తున్నపుడు ఆ పనులువలన కలిగే పరిణామాలు స్వీకరించటానికి సిధ్ధపడాలి. నీవు చేసే తప్పుడు పనులకు నీ ఆత్మ నీకు సాక్షి అని గుర్తించు.

13.12.97

82. జీవితములో జరిగిపోయిన సంఘటనలకు నీవు సాక్షీభూతుడివి. గత జీవిత ఆలోచనలకు విలువ ఇవ్వరాదు. వర్తమానాన్ని నమ్ముకొని ప్రశాంతముగా జీవించు.

10.01.98

83. జీవితములో నీపై నీకు నమ్మకము కలిగేలాగ జీవించటము నేర్చుకో. నీ స్వశక్తిమీద నీవు ఎంత పని చేయగలవు అనేది నీకు తెలిసిన రోజున నీవు నీ పై అధికారి ప్రాపకము కోసము ప్రయత్నము చేయనవసరము లేదు. నీ శక్తికి తగిన పని చేసి జీవితములో సుఖశాంతులు పొందు.

21.01.98

84. జీవితములో నరుడిని పూజించిననాడు అతడు నిన్ను బానిసగా చూస్తాడు. అదే నీవు నారాయణుడిని పూజించిన ఆయన నీకు ప్రత్యక్షమై "నేను నీ బానిసను" అని అంటారు.



(శిఖరాలు - లోయలలో శ్రీ సాయి సమాప్తం)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Wednesday, November 2, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

0 comments Posted by tyagaraju on 7:04 AM






02.11.2011 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు
కూర్పు : సాయి. బా. ని. స.

61. జీవితము ఒక ఖాళీ కుండ వంటిది. కుండలో నీరు నింపకపోతే దాని తయారీకి అర్థము లేదు. అలాగే మానవుడు తన మనసులో భగవంతుని గురించి ఆలోచించకపోతే ఆ జన్మకు అర్థము లేదు.

26.06.93

62. జీవితము విక్రమాదిత్యుడు - భేతాళుడు కధ లాంటిది. నీవు విక్రమాదిత్యుడివి. నీపని నీ గమ్యం (మోక్షము) చేరే వరకు కష్టాలు సుఖాలు అనే భేతాళుడిని మోయటమే.

29.06.93

63. జీవితములో కోరికలు గోడమీద నిలబడియున్న మేకవంటిది. ఆకుకూరలు, పండ్లు, కూరగాయల గంపలు నేలమీద యున్న లంచాలు వంటివి. కోరికలను అదుపులో పెట్టలేక లంచాలు తినాలి అనే కోరికతో మేకలాగ గోడ పైనుండి క్రిదకు దూకిననాడు విరిగేది యెవరి కాళ్ళు అనేది ఆలోచించాలి.

06.10.93

64. జీవీతము ఒక సైకిలు ప్రయాణము వంటిది. ఎల్లపుడు నీ జీవిత భాగస్వామిని వెనుక సీటులో కూర్చుండబెట్టుకొని జీవిత ప్రయాణము కొనసాగించి ప్రయాణములోని కష్ట సుఖాలు పాలు పంచుకో.

10.07.93

65. జీవితము సముద్ర తీరమువంటిది. సముద్రానికి పోటు, ఆటు వస్తాయి. అటువంటప్పుడు సముద్రపు నీరు ఒడ్డుకు విపరీతముగా వస్తుంది. కొంతసేపటి తర్వాత ఆ సముద్రపు నీరు సముద్రములోనికి వెళ్ళిపోతుంది. అటువంటి సమయములో కష్టాలు అనే చేపలు, అహంకారము అనే పాములు ఒడ్డున ఉన్న రాళ్ళమీద పడి గిలగిల కొట్టుకొంటాయి. కాని భగవంతుని అనుగ్రహము అనే ముత్యపు చిప్పలు ఒడ్డున మిగిలి యున్న కొద్దిపాటి నీళ్ళలో ప్రశాంతముగా ఈదుతూ ఉంటాయి.

06.08.93

66. జీవితము అనే రైలు ప్రయాణములో సుఖశాంతులు కావాలి అంటే బంధువులు, స్నేహితులతో (రాగ ద్వేషాలకు నిలయాలు) ఎక్కువ పరిచయాలు ఉండరాదు. ప్రయాణములో నీవు ఎన్ని సామానులు (ఆస్థిపాస్థులు) మోయగలవో అన్ని సామానులు మాత్రమే తీసుకొని టైముకు సరిగా స్టేషనుకు రావాలి. (టైముకి సరిగా నీ బరువు బాధ్యతలు పూర్తి చేయాలి). రైలు పెట్టెలో సరిగా కూర్చుని సుఖప్రయాణము చేయాలి. తలుపు దగ్గర నిలబడి బయటకు అనవసరముగా చూడరాదు. (అనవసరపు విషయాలలో తలపెట్టరాదు) అపుడే జీవితము అనేరైలు ప్రయాణము సుఖశాంతులతో సాగిపోతుంది.

09.08.93

67. జీవితము ఒక రైలు ప్రయాణము వంటిది అని మన అందరికి తెలుసు. మరి ఈ ప్రయాణానికి అంతము నీకు తెలుసా ! విను, నీ రైలు తిరిగి తిరిగి ఆఖరికి నీవు ప్రయాణము ప్రారంభించిన మొదటి స్టేషన్ కు చేరుతుంది. (తల్లి గర్భము నుండి నీ ప్రయాణము ప్రారంభము అయినది. మరణము తర్వాత తిరిగి తల్లి గర్భములో చేరుకొంటావు) అదే నీ రైలు ప్రయాణానికి అంతము.

19.09.93

68. జీవితము ఒక సర్కసు వంటిది. ఆ సర్కసులో ఊయలమీద ఊగటము జీవితములో కష్టతరమైన పనులు చేయటమువంటిది. ఊయల ఊగుతుంటే క్రింద పడితే రక్షించటానికి వల ఉండదు. ఊయల ఊగటము ఆపలేము. అటువంటి సమయములో నా నామస్మరణ చేస్తూ ఊయల ఊగు. ఒకవేళ నీవు ఊయలనుండి జారిపడితే నిన్ను రక్షించటానికి నా చేతులు చాచి యుంటాయి.

11.10.93

69. జీవితము ఒక అంతులేని యాత్ర. నీవు ఆయాత్రలో జన్మలు యెత్తుతున్న ఒక యాత్రికుడివి.

15.10.93

70. జీవితము అనే పడవ ప్రయాణములో భార్య తెరచాప వంటిది. గాలివాలు బాగా ఉన్నపుడు ఆ తెరచాపను ఎగరవేయాలి. గాలివాలు లేనపుడు తెరచాప ఎగరవేసిన, ఆ పడవ ప్రయాణానికి తెరచాప అడ్డముగా మారుతుంది -- జాగ్రత్త.

26.11.93

71. జీవిత బస్సు ప్రయాణములో ప్రయాణీకులలో దైవ చింతనపరులు, అనాధ బాల బాలికలు, హరిజనులు, గిరిజనులు, అన్య మతాలవారు ఉంటారు. నీవు భగవన్నామస్మరణ చేస్తూ సర్వజనులు సుఖశాంతులతో ప్రయాణము చేయాలి అనే కోరికతో గతుకుల రోడ్డుమీద ధైర్యముగా బస్సును ముందుకు నడిపించాలి.

03.01.94

72. జీవితము ఒక అంతులేని నడక. దారిలో ఇతరులతో కలసి ఆటలాడుతాము. పాటలు పాడుతాము, పోటీలు పడతాము. పోటీలలో ఒకళ్ళే గెలుస్తారు. రెండవవాడు ఓడిపోతాడు. ఓడినవాడు, నెగ్గినవాడు సంతోషపడటములోను అర్థము లేదు. అదేవిధముగా మానావమానాలు గురించి ఆలోచించటములో అర్థము లేదు.

12.04.94

73. జీవితము ఒక లారీని నడపటము వంటిది. బరువు బాధ్యతలను లారీలో వేసుకొని నడపాలి. రోడ్డుమీద మిగతాలారీలకు ప్రమాదాలు జరిగిన మనము అధైర్యము పడకుండా మన లారీని గమ్యస్థానము చేర్చాలి.

23.06.94

74. జీవితములో న్యాయము అన్యాయము అనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. అన్యాయాన్ని మరచిపోయి నీవు న్యాయమైన మార్గములో ప్రయాణము చేయి.

04.07.94

75. జీవితములో సత్యము, అసత్యము అనేవి రెండు అంశాలు. మనిషి కష్టాలలో ఉన్నపుడు అతనికి కొన్ని అసత్యాలు చెప్పి అతని మనసుకు కొంత శాంతిని కలగ చేసిన పాపము కాదు. ఏదైన ఒక విషయములో 90 శాతము సత్యము 10 శాతము అసత్యము యున్న ఆవిషయమును సత్యముగా చెప్పబడుతోందే. అందుచేత మనముందుకు వచ్చే సత్యము, అసత్యములలో మంచిని మాత్రమే తీసుకుని ముందుకు సాగిపోవాలి.

08.08.94

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

(ఇంకా ఉంది)

Tuesday, November 1, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

0 comments Posted by tyagaraju on 8:51 AM





01.11.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు

కూర్పు : సాయి. బా. ని.స.

46. జీవితములో గతించిన కాలము నిన్ను పగ పట్టిన పాములాగ వెంటాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆ పాము ఏమీ చేయలేదు. నీ బరువు బాధ్యతలను నీవు నిర్వర్తించటము ఆధ్యాత్మిక చింతనలో ఒక భాగమే! నీ బరువు బాధ్యతలను నీవు నిర్వర్తించకపోతే నీ గత చరిత్ర అనే పాము నిన్ను కాటు వేస్తుంది జాగ్రత్త.

19.04.96

47. జీవితములో గతించిన కాలపు వాసనలును వదిలించుకొని ప్రశాంతముగా వర్తమానములో జీవించు. పునర్జన్మ గురించి ఆలోచించవద్దు. నీ గురువు మీద నీకు నమ్మకము ఉన్ననాడు ఆయన నీవర్తమానాన్ని నీ పునర్జన్మను చూసుకొంటారు.

07.11.96

48. జీవితములో నీ వారినుండి నీవు ప్రేమను పొందలేనినాడు బాధపడటము సహజమే. ఇటువంటి బాధలలో ఇతరుల ఓదార్పును మాత్రము కోరవద్దు. నీవు పొందలేకపోయిన ప్రేమను ఏదో రూపములోనైన ప్రసాదించమని భగవంతుని వేడుకో.

12.12.96

49. జీవితములో విద్యాదానము, అన్నదానము చేసిన వ్యక్తి మరణించితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కన్నీరు కార్చకపోవచ్చు - కాని, ఆ వ్యక్తినుండి విద్యాదానము, అన్నదానము స్వీకరించినవారు తప్పక కన్నీరు కార్చుతారు.

17.12.96

50.జీవితములో ధనము ఉన్నవారు, ధనము లేనివారు కూడా సంతోషముగా జీవించుతున్నారు. జీవించటానికి ధనము ఒక్కటే ప్రధానము కాదు. సంతోషముగా జీవించాలి అనే పట్టుదల ముఖ్యము.

24.01.97

51. జీవితములో సుఖశాంతులు కావాలి అంటే ఆ బీద యింట పుట్టి చిరునవ్వుతో ఏ చీకు చింత లేకుండ ఉన్న ఆ చిన్నపిల్లలను చూడు. నీ మనసు కూడా ఆ చిన్న పిల్లల మనసులాగ ఉన్న రోజున సుఖశాంతులు వాటంతట అవే వస్తాయి.

28.01.97

52. జీవితములో శతృత్వము మంచిది కాదు. అది వచ్చే జన్మకు ప్రాకుతుంది అని తెలిసికూడా, ఈ జన్మలో తోటివాడితో శతృత్వము పెంచుకొని నరక బాధపడటములో అర్థము లేదు. ఈ జన్మకు సార్ధకత లేదు.

28.01.97

53. జీవితములో అన్నీ సవ్యముగా జరుగుతూ ఉంటే చికాకులు ఉండవు. కాని విధివ్రాత వలన ఏమాత్రము తేడా వచ్చిన మనసులో చికాకులు కలుగుతాయి. చికాకులు కలగకుండ ఉండాలి అంటే అనుక్షణము భగవంతుని నామస్మరణ చేస్తూ జీవించాలి.

07.07.97

54. జీవితములో పాత జ్ఞాపకాలు పాడుబడిన భవనాలవంటివి. అవి నివాసయోగ్యము కావు. అలాగే పాత జ్ఞాపకాలు భవిష్యత్తుకు పనికిరావు. అందుచేత పాత జ్ఞాపకాలను మరచిపోవటము మంచిది.

26.07.97

55. జీవితములో మనము వదలివేసిన ఆస్తి పాస్తులు మనము మిగిల్చే జ్ఞాపక చిహ్నాలు. కాల చక్రములో ఈ జ్ఞాపక చిహ్నాలు కూడా మరుగున పడతాయి. అందుచేత ఎన్నటికీ మరుగుపడని ఆ భగవంతుని జ్ఞాపకము ఉంచుకోమని నీ భావితరాలవారికి తెలియచేయటము మంచిది.

09.03.93

56. జీవితములో స్నేహము అనేది సమ ఉజ్జీగలవారితో చేయాలి. నీకంటే గొప్పవారితో (ధనవంతులతో) స్నేహము చేసి వారి చేత అవమానింపబడటముకంటే వేరే దౌర్భాగ్యము ఉండదు అని గ్రహించు.

02.08.97

57. జీవితములో ప్రతి మనిషి ఒక సమయములో ఉన్నత స్థితిని చవిచూస్తాడు. తర్వాత అక్కడనుండి సాధారణస్థితికి చేరుకొంటాడు. అటువంటిసమయములో నిజమును అంగీకరించటమే ఆధ్యాత్మిక శక్తి.

08.08.97

58. జీవితములో ఒకసారి ఆధ్యాత్మిక రంగములో అడుగుపెట్టిన తర్వాత తిరిగి ప్రాపంచిక రంగములో వెనుకకు అడుగువేయటము అంటే పతనానికి నాంది అని అర్థము.

08.08.92

59. జీవితము అనే రైలు ప్రయణములో సాయి పేరిటగల టికెట్టుతో ముందుకు సాగిపోతున్న సమయములో నీపేరిట టికెట్టులేదని ఆలోచనలు ఎందుకు? శ్రీ సాయి నీలోను ఉన్నారు అనే ధైర్యముతో ముందుకు సాగిపో.

21.08.97

60. జీవితములో ఒడిదుడుకులు అనే వరద రావటము సహజము. ఆ వరదలో ఈదటానికి కావసిన శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. అంతేగాని, ఆ ఒడిదుడుకుల వరదలో జీవించటానికి ప్రశాంతత ఇవ్వమని వేడుకోరాదు. జీవితములో కష్టాలను ధైర్యముగా ఎదుర్కోవాలి. అంతేగాని కష్టాలతో రాజీ పడరాదు.

19.08.97


సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు

(ఇంకా ఉంది)

Monday, October 31, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

0 comments Posted by tyagaraju on 7:55 AM



31.10.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు

కూర్పు :: సాయి. బా. ని. స

31. జీవితము ఒక క్రికెట్ ఆట వంటిది. నీవు బౌలింగ్ చేస్తూ ఉంటే నీ పిల్లలు ఎప్పుడు బ్యాటింగ్ చేస్తూ సెంచరీలు కొట్టి ఆటనుండి విరమించుకొంటారు. నీవు బ్యాటింగ్ చేయాలి అనే ఉద్దేశ్యముతో నీ పిల్లలను బౌలింగ్ చేయమంటే వారు బౌలింగ్ చేయటానికి చికాకు పడతారు. నీవు నీ జీవితములో ఏవిథమైన పరుగులు చేయకుండానే ఆటలో మిగిలిపోతావు.

17.08.95

32. జీవితములో థన సంపాదన చేసి ఇనుప పెట్టెలో జాగ్రత్తగా దాచుకొని నీ జీవిత అవసరాలు కోసము ఆ ధనాన్ని జాగ్రత్తగా వాడుకో. అంతే గాని ఆ ఇనుపపెట్టి తాళాలు మాత్రము నీ పిల్లల చేతికి ఇచ్చినావో - వృధ్ధాప్యములో నీకు మిగిలేది చికాకులు మాత్రమే అనేది గుర్తుంచుకో.

17.08.95

33. జీవిత ప్రయాణములో వెలుతురు, చీకటి వస్తాయి. చీకటి ప్రయాణములో సమర్థ సద్గురువు అనే దీపాన్ని నీతోడుగా తీసుకొని ప్రయాణము సాగించునపుడు, ఆ దీపపు కాంతిలో నీ విరోధి కూడ మితృడులాగ కనబడతాడు. నీ గమ్యాన్ని నీవు ప్రశాంతముగా చేరగలవు.

05.09.95

34. జీవితములో దుర్వ్యసనాలకు దూరంగా యుంటు, ధర్మాన్ని పాటిచుతూ ధన సంపాదన కొనసాగించుతూ ఇతరుల విషయాలలో కలుగచేసుకోకుండా పేరు ప్రఖ్యాతులు కోసము ఎదురుచూడని రోజున నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించినట్లే. - నీవు నీ భార్యలోను, నీ తల్లిలోను నన్ను చూడగలిగిన రోజున నీవు ఆధ్యాత్మిక రంగములో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లే.

11.04.96

35. జీవితములో ధనమే ముఖ్యము కాదు. ధన గర్వముతో నీ వాళ్ళను దూరం చేసుకుంటే ఆఖరి రోజులలో నీ జీవితము ప్రాణం ఉన్న శవములాగ తయారు అగుతుంది.

28.01.93

36. జీవితాన్ని ఒక యంత్రముతో పోల్చవచ్చును. యంత్రము పని కాలము పూర్తి అయినతరువాత దానికి మరమ్మత్తులు చేయలేక ఆ యంత్ర భాగాలని వేరు చేసి కొలిమిలో కరగపెట్టి తిరిగి ఇనుప దిమ్మలగా చేసి నూతన యంత్రాలుగా మార్చుతారు. అదే విధముగ భగవంతుడు సృష్టించిన ఈ శరీరము ఒకనాడు మట్టిలో కలసిపోయి తిరిగి ఆ మట్టి నుండి నూతన జన్మ ఎత్తవలసినదే.

01.07.96

37. జీవిత ప్రయాణములో నీ తోటి ప్రయాణీకులతో చక్కగా మాట్లాడుతూ (భార్య పిల్లలతో జీవించుతూ) చిన్న చిన్న విషయాలపై గొడవలు పడి వారికి చెప్పకుండా దూరముగా వెళ్ళిపోవడము మంచి పధ్ధతి కాదు. నీవు జీవితములో నీ తోటి ప్రయాణీకులకు దూరముగా ఉండదలచిన, వారికి ఆ విషయము చిరునవ్వుతో చెప్పి వారినుండి దూరముగా వెళ్ళిపో.

17.07.96

38. జీవితములో బరువు బాధ్యతలు ఆఖరి వరకు ఉంటాయి అని గ్రహించి దాని ప్రకారం నడచుకొనువాడు తెలివైనవాడు. జీవితములో మమతలు మమకారాలు మధ్య కొట్టు మిట్టాడుతూ ఆఖరి శ్వాసవరకు జీవించువాడు తెలివిహీనుడు.

19.07.96

39. జీవితములో ఎన్నిసార్లు గంగాస్నానము చేసినాము అనేది ముఖ్యము కాదు. నీ మన్సులోని మురికి ఎంతవరకు శుభ్రము చేసుకొన్నావు అనేది ముఖ్యము.

08.08.96

40. జీవితములో తెల్లని వస్త్రాలు ధరించటము అంటే సుఖశాంతులు కోరటము - మరి ఆ తెల్లని వస్త్రాలపై మురికి చేరటము అంటే కష్టాలు కొనితెచ్చుకోవటము. ఆ మురికిని సద్గురువు సహాయంతో మనమే శుభ్రము చేసుకొని సుఖశాంతులతో నిండిన జీవితాన్ని గడపాలి.

19.09.96

41. జీవితములో నీవు కష్టాలు పడినపుడు ఆ కష్టాలను మర్చిపోరాదు. నీవు ఎదుటివానికి ఆ కష్త్టాలు కలిగించరాదు. అపుడు నీవు నిజమైన మానవుడివి. నీవు అనుభవించిన కష్టాలను ఎదుటివానికి కలిగించితే నీవు దానవుడివి.

29.09.96

42. జీవితములో పొందిన కష్టాలు-సుఖాలు నుండే మనిషికి ఆధ్యాత్మిక భావాలు వస్తాయి. ఆధ్యాత్మికము అనేది వేరేగా ఎక్కడా వ్రాసి లేదు.

01.10.96

43. జీవితము ప్రశాంతముగా గడవాలి అంటే నీవు చేసే పనిలో ముందు చూపు ఉండాలి. నీ ప్రవర్తనలో కరుణ ఉండాలి. అప్పుడే నీ జీవితము ఒడి దుడుకులు లేకుండ ప్రశాంతముగ సాగిపోతుంది.

25.10.96

44. జీవితములో యవ్వన దశలోనే తీర్థయాత్రలు, బరువు బాధ్యతలు పూర్తి చేసుకొని వృధ్ధాప్యము వచ్చేసరికి ప్రశాంత జీవితము గడుపుతూ భగవన్నామ స్మరణ చేయి. ప్రశాంత జీవితము ఆధ్యాత్మిక చింతనకు చాల అవసరము.

18.11.96

45. జీవితములో కష్టాలను మరచిపోవటానికి మత్తు పానీయాలు త్రాగవద్దు. భగవంతుని ప్రేమ పొందాలనే తపనతో ఉపవాసము చేయవద్దు.

18.11.96

సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు


(ఇంకా ఉంది)


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List