Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 29, 2011

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

0 comments Posted by tyagaraju on 8:10 AM




29.10.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాబంధువులకు బాబావారి శుభాసీస్సులు

ఇంతవరకు మనము సాయి.బా.ని.స అనుభవాలను చదివాము. ఈ రోజు నుంచి సాయి.బా.ని.స. ఏర్చి కూర్చిన ఆయన చెప్పిన ఆణి ముత్యాలను తెలుసుకుందాము.

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

మానవ జీవితము గురించి శ్రీ షిరిడీ సాయి ఆలోచనలు

కూర్పు: సాయి. బా. ని.

1. జీవితము ఒక తెల్లకాగితము వంటిది. దానిమీద మంచి విషయాలు వ్రాస్తే కాగితాన్ని నెత్తిమీద పెట్టుకుంటాము. చెడు విషయాలు వ్రాస్తె చింపి పారవేస్తాము.

శిరిడీ సాయి 18.09.92

2. జీవితములో ఆధ్యాత్మిక చింతన అనే నిచ్చెన కొంత వరకు ఎక్కిన తరవాత అక్కడ జాగ్రత్తగా నిలబడాలి. అక్కడనుండి క్రిందకు దిగజారకూడదు.

శిరిడీ సాయి 22.08.92

3. జీవితము ఆటల పోటీవంటిది. చిన్న పిల్లల మధ్యన ముసలివాడు కూడ సంతోషముగా ఆటలు ఆడాలి.

శిరిడీ సాయి 09.04.92

4. జీవితములో చేసిన తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గములో నడిచేవాళ్ళు అన్నము పెడితే కాదనకుండ స్వీకరించు.

శిరిడీ సాయి 02.08.92

5. జీవీతము అనే నాటకములో నీ పాత్ర - "ఇతర పాత్రలను ప్రపంచానికి పరిచయము చేయటం వరకే" అని గుర్తుంచుకో.

శిరిడీ సాయి 30.09.92

6. జీవితములో ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించిన తర్వాత జీవత భాగస్వామి నీకన్న ముందుగా నా సన్నిధికి చేరితే బాధ పడకుండ శేష జీవితము పూర్తి చేసి నీవు నా సన్నిధికి చేరు.

శిరిడీ సాయి 14.09.92

7. జీవితము ఒక విద్యుత్ అయస్కాంతము. దానితో నీముందు ఉన్న మంచి, చెడులలో మంచినే గ్రహించేలాగ చూసుకో.

శిరిడీ సాయి 24.10.92

8. జీవితము ఒక పరుగుపందెము లాంటిది. భగవంతుడు అందరికి ఆలోచనా శక్తి కలిగిన మెదడును బహుమతిగా ఇచ్చి నిండు నూరు సంవత్సరాల దూరాన్ని మంచి నడవడికతో పరుగు ఎత్తమంటే ఎంతమంది గమ్యము చేరుకుంటున్నారు.

శిరిడీ సాయి 18.11.92

9. జీవిత శిఖరాల పై ఉన్న ప్రాపంచిక మంటలలో బాధపడే కన్న జీవితలోయలలోని ఆధ్యాత్మిక సెలయేరుల ప్రక్కన ప్రశాంతముగా జీవించటము మిన్న.

శిరిడీ సాయి 27.06.92

10. జీవితము ఒక పెద్ద నది కానవసరము లేదు. అది ఒక చిన్న సెలయేరు కావచ్చును. చిన్న సెలయేరు కూడ ఆఖరికి సముద్రములో (నాలో) కలవాలి కదా.

శిరిడీ సాయి 15.07.92

11. జీవితము కొబ్బరి చెట్టులాగ పెరిగి సంఘానికి ఉపయోగపడాలి. అంతేగాని సీమచింత చెట్టులాగ ఎదిగి ఏమి చేయాలి?

శిరిడీ సాయి 10.12.92

12. జీవితము పచ్చటి వరిపైరులాగ ప్రతి సంవత్సరము పంటలు పండించుతూ సంఘానికి ఉపయోగపడాలి. ఒకసారి రాయి త్రవ్విన తర్వాత పనికి రాని రాతిగ మారితే ఎవరికి ఉపయోగము?

శిరిడీ సాయి 10.12.92

13. జీవితము కష్ట సుఖాల మయము. నీవు సుఖమును సంతోషముగా కోరినప్పుడు కష్టాలను కూడ నీవు సంతోషముగా స్వీకరించాలి.

శిరిడీ సాయి 13.12.92

14. జీవితము అనే నదికి ప్రతిరోజు పండగే. పండగలో జనాలు స్నానానికి వస్తూ పోతూ ఉంటారు. జన సమ్మేళనలో మితృలు కలుస్తారు. శతృవులు ఎదురు అవుతారు. అందరితోను కలసి మెలసి తిరగాలి తప్పదు.

శిరిడీ సాయి 01.06.93

15. జీవితములో బంధాలు తెంచుకోవటము అంత సులభము కాదు. నీ విధి, నీబాధ్యతలను నీవు నిర్వర్తించు.

శిరిడీ సాయి 17.12.92

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

(ఇంకా ఉంది.)

Wednesday, October 26, 2011

కష్టమొచ్చినా సాయిని మరవద్దు

0 comments Posted by tyagaraju on 7:36 AM




26.10.2011 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

సాయి బంధువులందరికీ బాబావారి దీపావళి శుభాకాంక్షలు




ఈ రోజు నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపిన బాబా లీలని తెలుసుకుందాము. ఈ లీల సాయి భక్తురాలయిన రియా గారు అమెరికానించి పంపించారు.



సాయి సిస్టర్ రియా అమెరికా నించి తమ అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.

కష్టమొచ్చినా సాయిని మరవద్దు



సాయి భక్తులందరి అనుభూతులను ఎన్నిటినో నేను చదువుతున్నాను. మొట్టమొదటిసారిగా నాకు నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. 12 సంవత్సరాలనించి నేను బాబాని సేవిస్తున్నాను. నా జీవితంలో ఆయన చూపించే లీలలు కూడా వృధ్ధి చెందుతున్నాయి. నేను వాటినన్నిటినీ వివరించలేను గానీ, గత 10 నెలలలో నాకు కలిగిన అనుభూతులని వివరిస్తాను.

అమెరికాలో రెసిషన్ వల్ల నాకు ఉద్యోగం పోయింది. 8 నెలలుగా ఉద్యోగం లేకుండా గడిపాను. ఫిబ్రవరి, 2010 లో నా ఉద్యోగం పోయినప్పుడు నేనంతగా బాధ పడలేదు. కారణం సాయి నాతోనే ఉన్నారని నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా. కాని సాయి నా ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నారనుకున్నాను.. మరలా కొత్తగా ఉద్యోగాలకి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నెలలు గడుస్తున్నా నాకు యెవరినించీ కూడా పిలుపు రాలేదు. పిలుపు వచ్చినా గాని ఎటువంటి ఉద్యోగమూ రాలేదు. జూన్/జూలై కల్లావర్క్ పెర్మిట్ కూడా ఒక సమస్య గా మారింది. నాకు చాలా నిరాశ ఎదురయింది. ఆ సమయంలో గురువార వ్రతము కూడా చేశాను గాని ఏమీ ఫలితం కనిపించలేదు. పరిస్థితులన్నీకూడా దుర్లభంగా మారి, బిల్లులు కట్టడానికి, కారు మీద తీసుకున్న అప్పు తీర్చడానికి కూడా చాలా కష్టమయింది. ఆ సమయములో నా స్నేహితులే నాకు సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాను గాని అవేమీ కూడా నా అవసరాలను తీర్చలేకపోయాయి. ఒకానొక సమయంలో నేనెంతగా కృంగిపోయానంటే అసలు సాయి ఉన్నారా అని అనిపించింది. నా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. కాని ఏమీ ఫలితం కనపడలేదు. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు రావడంతో నేను పూర్తిగా నాశనమయిపోయినట్లుగా అనిపించింది. ఒకనొక సమయంలో పూర్తి నిస్సహాయ స్థితిలో నేను సాయిని కూడా ప్రార్థించడం మానేసాను. కాని నన్ను నేను సమాధాన పరచుకుని సాయినే ప్రార్థించడం మొదలుపెట్టాను. వ్రతాలను చేయడం మానేశాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మానేసాను. నాకింక సహనం నశించి సాయిని సహాయం చేయమని అర్థించాను. ఆన్ లైన్లో బాబా ప్రశ్నలు సమాధానలలో ప్రశ్నలు అడగసాగాను. అందులో జవాబులో ఏది వస్తే అది అన్నీ చేశాను. ఉదాహరణకి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాను. గుడికి వెళ్ళమంటే గుడికి వెళ్ళాను. ఏది చేయమని వస్తే అదే విధంగా అన్నీ చేశాను.

భాబా సచ్చర్తిత్రలో చెప్పారు, ఏది యెలా జరగాలో అది జరుగుతుంది. తన భౌతిక దేహానంతరము తాను తన భక్తులకు సహాయం చేస్తానని చెప్పారు. సెప్టెంబరు నెల వచ్చేటప్పటికి నాకు ఇక సహనం పోయింది. చిన్న ఆశాకిరణం, నమ్మకం మాత్రమే మిగిలి ఉన్నాయి.
నేనెంతగా విసిగి పోయానంటే నేను ఉద్యోగప్రయత్నాలను కూడా మానేశాను. నేనిక ఒకటే చేసాను. సాయి ప్రశ్నలు జవాబులలో ఏది వస్తే అది చేయడానికి సిధ్ధమయ్యాను. నాకెప్పుడూ ఒకే సమాధానం వస్తూ ఉండేది. నవంబరు/డిసెంబరులలో పర్తిస్థితులలో మార్పు వస్తుందని. నాకు నమ్మకం ఉంది. కాని కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అక్టోబరు వరకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అక్టోబరు చివరలో నాకు పెద్ద ప్రమాదం జరిగి (వివరాలను నేను చెప్పదలచుకోలేదు) ప్రాణాపాయాన్నుండి బయటపడ్డాను. నాకివన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి, సాయి నా మొఱ ఎందుకని ఆలకించటంలేదని బాధపడుతూ ఉండేదాన్ని. మెల్లగా, రెండు రోజుల తరువాత సాయి నామీద తన అనుగ్రహాన్ని చూపడం మొదలుపెట్టారు. నన్ను చావునుంచి తప్పించినది సాయే అని నాకు అర్థమయింది. ఆ క్షణంలో నేను, నన్ను రక్షించమని సాయి నామాన్నే స్మరించాను, అప్పుడు నన్ను సాయె కాపాడారు. నవంబరు చివరి వారంలో నాకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కాని దానికి నేనెప్పుడూ అప్ప్లై చేయలేదు. వారు ఆన్ లైన్ లో నా రెజ్యూం చూసి నన్ను యింటర్వ్యూకి పిలవడం జరిగింది. ఇంటర్వ్యూ చాలా కఠినంగా జరిగింది. నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా అని సందేహం వచ్చింది.

అయినప్పటికీ నేను సాయిని ప్రార్థించాను. నాకు మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. నా వర్క్ పెర్మిట్ కూడా తిరిగి రెన్యూ చేయబడింది.

నేనిప్పుడు ఇక్కడ పనిచేస్తున్న చోట చాలా సంతోషంగా ఉన్నాను. నేనెప్పటినుంచో సాయిని పూజిస్తున్నప్పటికీ, ఈ చివరి నెలలలో ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నాను. వాటిని నేను మీతో పంచుకోదలచుకున్నాను.

జీవితంలో మనకందరికీ ఎన్నోసమస్యలు ఉంటాయి. అందరి జీవితాలూ వడ్డించిన విస్తరి కాదు. ఇప్పటికే మనకిచ్చినవాటిని గురించి మనం సంతోషించి, హృదయాంతరాళలోనించి భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితే మనలో మంచి శక్తి పెంపొందుతుంది. అదే మనకు జీవితంలో మంచిని కలగచేస్తుంది.

నాకేది జరిగినా అది భగవంతుని వల్ల జరిగినదే అని నేను భావించాను. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు నేను విచారిస్తూ ఉండేదానిని. ఇప్పుడు నా దృక్పధంలో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న విషయానికైనా భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు పునర్జన్మ.

నువ్వేదయినా పని జరగాలని కోరుకున్నప్పుడు అది జరగకపోతే, సాయి సహాయం చేయటంలేదు అని భావించద్దు. దానర్ధం మనం అనవసరంగా ఆందోళనపడుతూ ఉంటాము. కాని సమయం వచ్చినప్పుడు సాయి తప్పకుండా సహాయం చేస్తారు. సాయిమీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆయన మృత్యుకోరలనుండి కూడా రక్షిస్తారు.

పరిస్తితులు ఏమయినా కానివ్వండి, మనకోరికలు స్వచ్చమైననవి, తగినవి అయితే సాయి మనవెంటే ఉంటారు. సాయి మనలనెపుడు నిర్లక్ష్యం చేయరు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Tuesday, October 25, 2011

సాయితో సాయి బా ని స అనుభవాలు - 22

0 comments Posted by tyagaraju on 7:45 AM




25.10.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులందరికీ బాబా వారి శుభాశీస్సులు మరియు దీపావళి శుభాకాంక్షలు

సాయితో సా యి బా ని స అనుభవాలలో ఈ రోజు ఆఖరి అనుభవం


సా యి బా ని స

సాయితో సాయి బా ని స అనుభవాలు - 22

పవిత్రమైన సాయి సచ్చరిత్రను భక్తి శ్రధ్ధలతో పారాయణ చేసినందువల్ల కలిగే ఫలితాన్ని గురించి ఫల శృతిగా సాయి సచ్చరిత్ర 51 వ అధ్యాయములో వివరంపబడింది. సాయిమీద ప్రేమతో, నమ్మకంతో పారాయణ చేసినవారి కష్టాలన్ని తొలగిపోతాయని చెప్పబడింది. వారము రోజులలో పారాయణ పూర్తిచేసిన తరువాతనించీ ఆయననే పూజిస్తూ ఉంటే కనక మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి, ప్రాపంచిక కోరికలన్ని కూడా తీరతాయని చెప్పబడింది. ప్రతీరోజు సాయి సచ్చర్తిత్రలోని ఒక అధ్యాయాన్ని చదవడం నా దినచర్యలో ఒక భాగం. 51 అధ్యాయాలను పూర్తిచేసిన ప్రతీసారి నాకెంతో మనశ్శాంతి లభించి ఆనందం కలుగుతూ ఉండేది. నా నమ్మకం ఇంకా పెంపొందడానికి ఏదొ ఒక సంఘటన జరుగుతూ ఉండేది. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఒక విచిత్రమైన మరచిపోలేని అనుభూతి. సాయితో సాయి బా ని స అనుభవాలలో ఇది ఆఖరిది.

దక్షిణ కొరియాలో నాకు జరిగిన అనుభవాలలో ఒకదానిని నేను మీకిప్పుడు వివరిస్తాను. 15.05.1991 న నేను చాంగ్వాన్ పట్టణంలో ఉన్నప్పుడు, శ్రీ సాయి సచ్చరిత్రలోని 51 వ అధ్యాయం చదవడం పూర్తి చేశాను. ఆ రోజు రాత్రికి మిస్టర్ లీ అనేఆయన నన్ను నా స్నేహితుడిని భోజనానికి పిలవడంతో ఆయన యింటికి వెళ్ళాము. వారింట భోజనమయినతరువాత మిస్టర్ లీ గారు మమ్మలని తన కారులో మాహోటలు వద్ద దింపారు.

భోజనానంతరము కారులో నాకు కలిగిన ఆలోచనలు మీకు తెలియపరుస్తాను. ఈ రోజున శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశానె, మరి నాకు ఏవిధమయిన అనుభూతిని బాబా ప్రసాదించలేదే అని బాధడినాను. మేము హోటలు ముందు కారు దిగిన వెంటనే మిస్టర్ లీ గారు ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన విన్న వెంటనే నేను ఆశ్చర్య పోయినాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే అక్కడకి దగ్గరలో ఉన్న కొండమీద బౌధ్ధ దేవాలయము ఉంది. మేము అనుమతించినచో మమ్ములను ఆ దేవాలయమునకు తీసుకుని వెళ్ళాలని ఉందని తెలియచేయడము. ఆ దేవాలయము రాత్రి 10 గంటలకు మూసివేసెదరు. అందుచేత వెంటనే తిరిగి కారు యెక్కినచో తను మమ్ములను ఆ దేవాలయమునకు తీసుకుని వెడతానని చెప్పినారు. నేను నా మితృడు శ్రీనివాసరావు తిరిగి ఆ కారులో కూర్చున్నాము. మిస్టర్ లీ గారు కారును గంటకు వంద కిలోమీటర్ల వేగముతో నడుపుతూ రాత్రి 10 గంటల ప్రాంతానికి ఆ దేవాలయము వద్దకి తీసుకుని వెళ్ళినారు. ఆ దేవాలయములో తెల్లని వస్త్రాలను ధరించిన బౌధ్ధ లామాగారు, మాకు స్వాగతము పలకడానికి ముఖద్వారము వద్ద వేచి ఉన్నట్లు భావన కలిగింది. ఆ బౌధ్ధ దేవాలయము నా కంటికి ద్వారకామాయిలా కనిపించినది. ఆ బౌధ్ధ లామాగారిలో నేను బాబాగారిని చూడగలిగాను. బౌధ్ధలామాగారి పాదాలకు నేను నమస్కరించాను. ఆయన ప్రేమతో నన్ను లేవనెత్తి కౌగలించుకున్నారు. మమ్ములను మందిరములోనికి తీసుకునివెళ్ళి మాకు గ్రీన్ టీ (తేనీరు) ఇచ్చినారు. మమ్ములను భారతీయులుగా గుర్తించి తనకు బుధ్ధదేవునితో ఉన్న అనుభవాలను తెలియచేసినారు. బుధ్ధ దేవుని ఆశీర్వచనాలతో మాకు వెండి డాలరులను బహూకరించినారు. యిదంతా శ్రీ సాయినాధులవారు నేను శ్రీ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలు పారాయణ చేసిన ఫలముగా భావించినాను. ఆనాటినుండి నేటి వరకు ఆ వెండి డాలరు నా మెడలో ధరించాను. అది ఈనాటివరకు నా మెడలోనే ఉన్నది. ఆ వెండి డాలరుని చేతితో తాకినపుడెల్లా శ్రీ షిరిడీ సాయినాధులవారు దక్షిణ కొరియా దేశములో నాకిచ్చిన బహుమానముగా భావిస్తూ ఆనందము పొందుతున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Sunday, October 23, 2011

సాయితో సాయి బా ని స అనుభవాలు - 21

0 comments Posted by tyagaraju on 7:58 AM



23.10.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 21 వ అనుభవాన్ని తెలుసుకుందాము

సాయితో సాయి బా ని స అనుభవాలు - 21


శ్రీ రఘునాధ అన్నా సాహెబ్ ధబోల్కర్ గారు హేమాద్రి పంత్ గా ఎలా పెరుగాంచారో మన సాయి భక్తులందరికీ తెలుసు. శ్రీ రఘునాధ అన్నా సాహెబ్ ధబోల్కర్ గారిని శ్రీ సాయి హేమాద్రి పంత్ అని ఏవిధంగా పిలిచిన విషయము శ్రీ సాయి సచ్చరిత్ర 2 వ అధ్యాయములో విపులముగా చెప్పబడింది. సాయితో సా యి బా ని స అనుభవాలు చదువుతున్న సాయి భక్తులందరికీ ఈ సాయి బానిస ఎవరూ, వారి అసలు పేరు ఏమిటి అనే సందేహాలు కలిగి ఉండవచ్చును. ఆ సందేహాలను నివృత్తి చేయడం నా ధర్మము అని భావించి శ్రీ సాయి నన్ను సాయి బా ని స గా నామకరణం చేసిన సంఘటను తెలియపరుస్తాను.

నేను శ్రీమతి రావాడ వెంకట రమణమ్మ, శ్రీ రావాడ వెంకట రావు పుణ్య దంపతులకు 24.04.1946 నాడు జన్మించాను. నా తల్లి తండ్రులు నాకు రావాడ గోపాలరావుగా నామకరణం చేసినారు. మాది భారద్వాజస గోత్రం. మరి 1989 వ సంవత్సరం జూలై నెలలో శ్రీ సాయి నన్ను షిరిడీకి రప్పించుకుని తన సేవలోనూ, సాయి భక్తుల సేవలోనూ, జీవించే అదృష్టాన్ని ప్రసాదించారు. ఈ విధంగా సాయి నాకు మరొక జన్మ ఇచ్చారు. రోజులు గడుస్తున్నాయి. 1995 వ సంవత్సరము తరువాత నేను శ్రీ సాయికి సర్వశ్య శరణాగతి చేశాను. 1995 వ సంవత్సరములో ఒక గురువారమునాడు తేదీ నాకు సరిగా గుర్తు లేదు, మా యింటికి దగ్గరలో ఉన్న శ్రీ సాయి మందిరానికి వెళ్ళినాను. శ్రీ సాయి తను తన భక్తులకు బానిస అని శ్రీ సాయి సచ్చరిత్రలో 10 వ అధ్యాయములొ వివరంగా చెప్పి ఉన్నారు. మరి సాయినాధులవారు తన భక్తులకు బానిస అయినప్పుడు మరి నేను కూడా సాయి భక్తులకు బానిసనే కదా అనే భావనతో నన్ను బానిసగా స్వీకరించమని బాబాను వేడుకుంటూ వారి విగ్రహం ముందు ధ్యానము చేయసాగాను. వారి ధ్యానములో ఉండగా నాకెటువంటి దృశ్యము కనిపించలేదు. కాని నా పక్కన ఎవరో నిలబడి నా చెవిలో "నా బాధ్యతలు నిర్వర్తించే సన్యాసీ కళ్ళు తెరు". అన్న మాటలు విపడ్డాయి. ఒక్కసారిగా ఆశ్చర్యముతో కళ్ళు తెరిచి అన్నివైపులా చూసాను. ఎవరూ కనిపించలేదు. సాయినాధులవారు స్వయంగా ఈ మాటలు అన్నారని భావించి ఒక కాగితముపై సాయి బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి అని వ్రాసుకున్నాను. ఇంకొక కాగితముపై సాయి కి బానిసని అని వ్రాసుకున్నాను. ఆ రెండు కాగితములను ఒకే పరిమాణములో మడతలు పెట్టి ఆ రెండు చీటీలను బాబా పాదాల వద్ద ఉంచి ఈ రెండిటిలోను ఒక చీటీని ప్రసాదించి నాకు నామకరణం చేయమని ప్రార్థించినాను. నేను కళ్ళు మూసుకుని ఆ రెండు చీటీలలో ఒకచీటీని తీసి తెరిచి చూసినాను. ఆ క్షణమునుండి శ్రీ సాయి నన్ను బాధ్యతలను నిర్వర్తించే సన్యాసీ అని పిలిచినారు అని భావించి సా యి బా ని స గా సాయి బంధువులకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

ఈ సాయి .బా .ని .స . తన ఆఖరి శ్వాస వరకు శ్రీ సాయి సేవలోనూ సాయి భక్తుల సేవలోనూ, తరించే భాగ్యాన్ని ప్రసాదించమని శ్రీ షిరిడీ సాయినాధులవారిని ప్రార్థిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List