Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 5, 2011

బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష

0 comments Posted by tyagaraju on 8:21 AM


06.08.2011/05.08.2011 శనివారము/శుక్రవారము

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

రేపు శ్రీరంగపట్టనము దగ్గరున్న నిమిషాదేవి ఆలయ దర్శనార్థం వెడుతున్న కారణంగా రేపటి బాబా లీల ఈ రోజే ప్రచురిస్తున్నాను. వరుసక్రమం తప్పకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతో.

ఈ సందర్భంగా నిమిషాదేవి ఆలయ చరిత్రను కొంచెం క్లుప్తంగా ఇస్తున్నాను. ఆలయం కూడా చిన్నదే.

నిమిషా దేవి ఆలయం

ఈ నిమిషా దేవి దేవాలయం శ్రీ రంగపట్టణానికి దగ్గరలో కావేరి నది ఒడ్డున ఉంది. మైసూరుకు దగ్గర శ్రీరంగపట్టణం. శ్రీరంగపట్టణం నించి ఆటోలో వెళ్ళి రావచ్చు.
ఇక్కడ మనమేది కోరుకుంటే అది తీరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఈ నమ్మకానికి రెండు కథనాలున్నాయి.


1. కోరుకున్న కోరిక నెరవేరడం, కోరిక తీరే ప్రక్రియ నిమిషంలోనే ప్రారంభమవుతుంది.


2. రెండవ నమ్మకం నిమిషాదేవి దీవెనలు ప్రతీ నిమిషం అందుతూ ఉండటం.


అందుకనే ఇక్కడి దేవతకి నిమిషాదేవి అన్న పేరు.



రెండు కథనాలు కూడా "ఒక నిమిషం" అన్నదానికి బంథం. ఈ దేవాలయంలో శక్తివంతమైన శ్రీ చక్రం ఉంది. దీనిని మూకాంబికా దేవాలయం నించి కృష్ణరాజ వడయార్ మహారాజు, ఈ నిమిషాంబా ఆలయాన్ని నిర్మించేముందు తీసుకుని వచ్చారు.


కాని ఒక విషయం ఈ దేవాలయానికి వెళ్ళి కోరుకున్న వెంటనె యెప్పుడు తీరుతుందా అని మనసులో చింత పెట్టుకోకుండా, ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి సిథ్థంగా ఉండాలి.

యిక తార్ఖడ్ వారి బాబా అనుభావలలో మరొకటి.

బాబా గారు పెట్టిన బంగారు పరీక్ష

ఓం శ్రీ సాయినాథాయనమహ

ప్రియమైన సాయిభక్త పాఠకులారా ! యింతవరకు నేను చెప్పిన ఈ అనుభవాలన్ని కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మన సాథారణ జీవిత చక్రం యెలా ఉంటుందంటే మొదట మనం సంసార జీవితానికి అల్లుకోవాలి, తరువాత మనకి తీపి, చేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని అనుభవించాక మనం చివరికి మనశ్శాంతి కోసం ఆథ్యాత్మికత వైపు ఆకర్షితులమువుతాము. కాని, ఈ చక్రం మా నాన్నగారి విషయంలో తిరగబడింది. ఆయన మొదట చాలా దివ్యానుభూతులని పొంది తరువాత కఠినతరమైన సంసార జీవితాన్ని గొడ్డలితో బాగా నలగగొట్టవలసి వచ్చింది. ఒక విషయం మాత్రం తేటతెల్లం, యెందుకంటే సాయిబాబా సాహచర్యంలో యెటువంటి పరిస్థితినైనా యెదుర్కొనే నేర్పుని పొందే అవకాశం వచ్చింది.

నేను కూదా నమ్మేదేమిటంటే భక్తి మార్గం యెటువంటిదంటే దానిని ఒకసారి సాథన మొదలు పెట్టాక జీవితంలొ యెటువంటి భయాన్నయినా యెదుర్కొనేందుకు చక్కగా సన్నథ్థమౌతాడు.

యిప్పటికి మా నాన్నగారు షిరిడీకి చాలా సార్లు వెళ్ళారు. ఆయన ఖాతాలో దివ్యానుభూతులను జమ చేసుకుని తగినంతలో థనవంతుడయారు. యిప్పుడు కొన్ని తిరకాసు క్షణాలను యెదుర్కొనే సమయం వచ్చింది. అప్పుడవి శీతాకాలపు రోజులు. పగటి రోజులు సమయం యెక్కువ, తాత్రి వేళ సమయాలు తక్కువగా ఉండేవి. అటువంటి ఒకరోజున సందె చీకటి వేళ ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలు కనపడుతున్నాయి. బాబా మా నాన్నగారిని తమతో కూడా రమ్మన్నారు. అది ఊహించని ఆహ్వానం. కారణం, బాబా అటువంటి సమయంలో ద్వారకామాయిని విడిచి యెప్పుడూ వెళ్ళరు. ఆయన "లెండీబాగ్" వైపు నడచుకుంటూ అక్కడినించి యింతకు ముందు అథ్యాయంలో వివరించిన వాగు ఒడ్డు వద్దకు వచ్చారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. చంద్రుడు ఆకాశంలోకి పైకి వచ్చాడు. అప్పుడు బాబా మా నాన్నగారితో తాను ఆయనకి ఒక విచిత్రం చూపించబోతున్నానని ఆ కారణం చేతనే ఆయనను ఆ చోటువద్దకు తీసుకుని వచ్చానని చెప్పారు. యేమయినప్పటికి తాను కొంత వ్యక్తిగతమైన ప్రత్యేకమైన శ్రథ్థను పొందుతున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు.
అప్పుడు వారి కింద కూర్చున్నారు. బాబా మెత్తగా ఉన్నమట్టిని తన చేతితో తొలగించడం మొదలు పెట్టారు. ఆయన మా నాన్నగారితో మట్టిలోకి చూసి యేమయినా కనపడుతోనదా అని అడిగారు. మా నాన్నగారు చూసి లేదని చెప్పారు. బాబా తిరిగి మరలా అదేపని చేశారు. మా నాన్నగారు రెండవసారి చూసి తనకు మట్టి మాత్రమే కనపడ్తోందని చెప్పారు. ఆపుడు బాబా మూడవసారి తిరిగి అదేపని చేసి, మా నాన్నగారి తల వెనుక తన చేతితో కొట్తి, ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు. మా నాన్నగారు ఆ ప్రదేశంలో చూడగా అక్కడ మెరుస్తున్న లోహాన్ని చూశారు. వెన్నెల వెలుగులో అది యింకా మెరుస్తూ కనపడింది. బాబా మా నాన్నగారిని ఏమయినా కనపడుతోందా అని ఆదిగారు. ఒక లోహపు వస్తువు మెరుస్తూ కనపడుతోందని మా నాన్నగారు చెప్పారు. అప్పుడు బాబా "భావూ, ఆ లోహం బంగారం తప్ప మరేమీ కాదు. నీకు యెంతకావలిస్తే అంత తీసుకో" అన్నారు.

మా నాన్నగారు బాబాతో "బాబా నాకిది వద్దు. మీ ఆశీర్వాదంతో మాకన్నీ వున్నాయి. మీనించి అటువంటి భౌతిక సంబంథమయినవాటిని తిరిగి పొందుదామనే ఉద్దేశ్యంతో నేనుషిరిడీకి రాను" అన్నారు. అప్పుడు బాబా ఆయనతో "భావూ, యిది లక్ష్మీదేవి, ఆమెకు నువ్వంటే యిష్టం లలిగింది. ఒక్కసారి కనక నువ్వు ఆమిచ్చిన వరాన్ని తిరస్కరిస్తే యిక యెప్పుడు ఆమె నీవద్దకు రాదు, కనీసం ఈ జన్మలోనయినా. అంచేత మరలా ఆలోచించుకో" అని ముందు జాగ్రత్తగా చెప్పారు. అప్పుడు మా నాన్నగారు ఆయనతో "బాబా ! నువ్వు నన్ను రసాయనిక పరీక్షకు గురి చేస్తున్నావు. నేను ఈ మాయకి యెరను కాబోను. ఒకసారి నామీద నీ ఆశీర్వాదములున్నంత వరకూ ఈ మాయ లేకుండా నేను ప్రశాంతంగా, సుఖంగా జీవిస్తాను." అన్నారు. అప్పుడు బాబా తిరిగి మట్టిని కప్పివేశాక, యిద్దరూ ద్వారకామాయికి తిరిగి వచ్చారు.

ఆ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షిరిడీ స్థానికుడొకడు వాగు ఒడ్డున జరిగినదంతా చూశాడు. సాయిబాబా మా నాన్నగారికి పాతిపెట్టబడిన నిథి యేదో చూపించి వుంటారని ఊహించాడు. బాగా రాత్రి పొద్దు పోయాక ఆ చోటకి వెళ్ళి ఆ నిథిని తవ్వి తీసుకుందామనుకున్నాడు. అనుకున్న విథంగా నిథి వేటకి సాహసం చేయడానికి అర్థరాత్రి లేచి వెళ్ళాడు. కాని, అయ్యో ! యెప్పుడయితే అతను గడ్డపారమీద చేతులు వేశాడొ, వెంటనే అతని వేళ్ళమీద తేలు కుట్టింది. అతను రాత్రంతా బాథపడుతూనే ఉన్నాడు. ఉదయమయేటప్పటికి బాథ భరింపరానంతగా ఉండటంతో తెలివిగా సాయిబాబా దగ్గరకెళ్ళి తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు. తను రాత్రి నిథి వేటకు వెళ్ళిన విషయం బాబాకి తప్ప మరెవరికీ తెలియపరచకూడదనుకున్నాదు. అతను ద్వారకామాయిలోకి ప్రవేశించినప్పుడు విపరీతమయిన బాథతో ఉన్నాడు. మా నాన్నగారు, ఆ స్థానికుడు బాబాని తన తప్పును మన్నించమని వేడుకుంటూ, యిక ఆ పాపం యెప్పుడూ చేయనని చెప్పడం చూశారు. తేలు కుట్టడం వల్ల కలిగిన భరింపరాని బాథ నుంచి విముక్త్ణ్ణి చేయమని అడిగా?డు. బాబా అప్పుడు "యెవరయినా తనకు దైవసంకల్పితంగా నిర్దేశించబడిన థనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దాని అర్థం యెవరినైనా తీసుకోమని కాదు. ఈప్రపంచంలో భగవంతుడు యెవరి అదృష్టాన్ని బట్టి వారికది లభించేలా ఒక నియమాన్ని యేర్పరిచాడు. యెవరయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో అతను భగవంతుని చేత శిక్షింపబడతాడని" చెప్పారు. మా నాన్నగారికి ఆ సంభాషణ అర్థమయింది. బాబా తన పవిత్రమైన ఊదీని తేలు కుట్టిన అతని వేలిపైద్ వ్రాసి, భవిష్యత్తులో చెడుగా ప్రవర్తించవద్దని చెప్పారు. భగవంతుడు అతన్ని ఈ బాథనుండి తప్పిస్తాడని ఆశీర్వదించారు.


షిరిడీలో మా నాన్నగారికి పెట్టబడిన "బంగారు పరీక్ష" అదీ. నేననుకునేదేమంటే ఆయన యిటువంటి మాయకు యెర కాకుండా సఫలీకృతులయారని. కాని ఒక విషయం మటుకు ఖచ్చితం, యేమిటంటే తన భవిష్యత్తులో ఆయన థనాన్ని కూడబెట్టుకోలేకపోయారు. లక్ష్మీదేవి ఆయనవద్దకు వెళ్ళడం మానుకొంది. కాని ఆయన ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. మనం ఆ చరిత్రలోకి వెళ్ళవద్దు.



సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.




Thursday, August 4, 2011

పునరుజ్జీవం పొందిన శవం

0 comments Posted by tyagaraju on 9:08 PM


05.08.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


శాయి బంథువులకు శ్రావణ శుక్రవారము బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు తార్ఖడ్ వారి అనుభూతులలో మరొక అనుభూతిని తెలుసుకుందాము.


పునరుజ్జీవం పొందిన శవం

ఓం శ్రీ సాయినాథాయనమహ

సాయి బాబా భక్తులందరికీ అటువంటి ఆథ్యాత్మిక అనుభూతులు కలిగి ఉంటాయని నాకు బాగా తెలుసు, దాని ఫలితం వల్లనే బాబా పేరు ప్రతిష్టలు అన్ని దేశాలలోను వ్యాపించింది. న్యూఢిల్లీకి దగ్గరలో ఉన్న ఛత్తర్పూర్ శ్రీ సాయి మందిరానికి సంబంధించిన బాబా భక్తురాలు మిస్. భకునీ గారిని కలుసుకోవడం జరిగింది. ఆమె చరిత్రలో పీ.హెచ్.డీ. చేస్తోంది. ఆమె యెన్నుకున్నది సాయిబాబా గురించి. ఆమె బాబా మీద యింతో పరిశోథన చేసింధి. వారి ట్రస్ట్ మూడు మాసాలకొకసారి హిందీలొ పత్రిక ప్రచురిస్తోంది. అది చాలా విజ్ఞానదాయకంగా వుంది. బాబాగారు ఉన్న కాలంలో ఆయన బోథనలు బొంబాయి, మహారాష్ట్రలలో ముఖ్యంగా దాస గణు మహరాజ్ వల్ల తప్ప మరెవరి వల్లా వ్యాప్తి చెందలేదు. బాబా ఆయనని "గన్యా" అని పిలుస్తూ ఉండేవారు. వాటి ద్వారా ఆయన బాబా లీలలు ప్రజల మీద ప్రభావం చూపేలా చేసి ఆయన బోథననలని సామాన్య ప్రజానీకం లోకి కూడా వ్యాపింప చేశారు.

ఒకసారి దాస గణు గారు షిరిడీలో ఉన్నప్పుడు, షిరిడీకి దగ్గిరున్న గ్రామంలో హరికథ చెప్పమని ఆయనని పిలిచారు. దాసగణూ గారు హరికథ ప్రారంభించేముందు, ఒక చిన్న బల్ల మీద బాబా చిత్రపటం ఉంచి, దానికి దండ వేసి మొదలు పెడుతూ ఉండేవారు. షిరిడీ కి దగ్గర, చుట్టుపక్కల హరికథలు చెప్పడానికి బయలుదేరేముందు ఆయన బాబా వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్ న్నం ఆయన ద్వారకామాయికి వచ్చి, తాను ఆ రోజు సాయంత్రం ప్రక్కనున్న గ్రామంలో హరికథ చెప్పడానికి వెడుతున్నానని, దానికి ఆయన ఆశీర్వాదములు కావాలని చెప్పారు.

బాబా గారు ఆయనతో స్వేచ్చగా వెళ్ళవచ్చుననీ, కాని తనతో కూడా భావూని (మా నాన్నగారిని) తీసుకువెళ్ళమని కోరారు.


దాస గణు, తనతో కూడా మా నాన్నగారిని తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదని, కాని సాయంత్రం ద్వారకామాయిలో ఆయన లైట్లు వెలిచించే అలవాటుకు అడ్డంకి అవుతుందని అందుచేత యిష్టం లేదని చెప్పారు. యిది వినగానే బాబా దాని గురించి ఆయన బెంగ పెట్టుకోనవసరం లేదని, ఆపని యెవరైనా చేస్తారని కాని దాసగణుతో భావూని తప్పకుండా తీసుకుని వెళ్ళమని మరీ మరీ చెప్పారు. దాసగణు, మా నాన్నగారు (ఆయన అప్పుడు అక్కడే వున్నారు) అది బాబావారి యిష్టపూర్వకమైన ఆజ్ఞ అని అర్థం చేసుకున్నారు. ఆపుడు వారు ఒప్పుకున్న సమయం ప్రకారం, ఆ సాయంత్రం 7, 8 కి.మీ. దూరంలో ఉన్న గ్రామానికి బయలుదేరి వెళ్ళారు.

ఆ రోజుల్లో యిప్పటిలాగా ప్రయాణ సాథనాలు లేకపోవడం వల్ల వారు కాలినడకన వెళ్ళాల్సి వచ్చింది. వారు గ్రామలోకి ప్రవేశించేసరికి, సూర్యుడప్పటికే అస్తమించాడు. వారు చాపలని నేలమీద పరచి, ఒక బల్ల మీద బాబా చిత్రపటాన్ని ఉంచి దండ వేశారు. పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి నాలుగు మూలలా వేలాడ దీశారు. గ్రామస్తులందరూ సమావేశమయ్యారు. దాసగణు గారు హరికథను మొదలుపెట్టారు.

ఒక గంట తరువాత బాగా రాత్రి అయాక వారు కష్టాన్ని యెదొర్కొన్నారు.

సుమారు 7, 8 మంది నల్లటిశరీర ఛాయలో , బహుశా భిల్ల జాతివారయి ఉండొచ్చు, అక్కడికి వచ్చారు. వారు తమ భుజాల మీద ఒక శవాన్ని మోసుకుని వస్తూ ఆఖరి సంస్కారాలు పూర్తి చేయడానికి సమాథిచేయడానికి వెడుతూ ఉన్నారు. వారి నాయకుడు దాసగణు మహరాజ్ వద్దకు వచ్చి, ఆయనని బెదిరించాడు. అతను బల్ల మీద ఉన్న ఫోటో గురించి అడిగాడు. దాసుగణు ఆ ఫోటో సాయిబాబా వారిదని వినయంగా చెప్పాడు. తను ఆయనని తన గురువుగా, దేవునిగా ఆరాథిస్తానని,. యింకా చెబుతూ సాయి బాబా బీదలకు వైద్యం చేసి వారి వేదనలని పోగొడతారని చెప్పాడు. గ్రామస్తులకు సంతోషాన్నిచ్చే హరికథలను చెబుతున్నానని వివరించారు.

అపుడా భిల్ల నాయకుదు తన తోటివారితో పాడెని కిందకి దిచమని చెప్పి, దాసగణూతో " అతని దేవుడే కనక శక్తిమంతుడయితే ఆ శవంలోకి ప్రాణం తెప్పించడం సాథ్యమే అని అన్నాడు. అతను ఆయనతో అలా చేయమని సవాలు విసిరి లేకపోతే ఆయనని, ఆయనతో ఉన్నవారిని చంపేస్తానని చెప్పాడు.

మా నాన్నగారు యిదంతా బహుశా బాబాగారు సృష్టించినదే అయి ఉండవచ్చని, రక్షించమని ఆయన దయకోసం ఆయననే వేడుకోవాలనుకున్నారు. ఆయన దాసగణుతో ఆయనకిష్టమయిన కీర్తన, "సాయి రహం నజర్ కర్నా, బచ్చోంకా పాలన్ కర్నా" పాడమని యిక బాబా నిర్ణయానికి వదలి వేయమని చెప్పారు. అపుడు దాసగణు తనకిష్టమయిన కీర్తనని పాడటం ప్రారంభించారు. ఆయన దానిలొ బాగా తన్మయత్వం చెందారు. మా నాన్నగారు ఆయనని ఆస్థితిలో యింతకు ముందెన్నడూ చూడలేదు. ఆయన అందులో లీనమయిపోయి నృత్యం చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఆయనతో కలిసి తలూపుతున్నారు. మానాన్నగారి దృష్టి వం మీదే ఉంది. ఒక గంట సమయం గడిచి ఉంటుంది. అనుకోని సంఘటన జరిగింది. శవంలోకి ప్రాణం వచ్చింది. అది తనకున్న కట్లన్నిటినీ తెంచుకుని పాడె మీద కూర్చుని చప్పట్లు కొడుతూ మిగతావారితోపాటుగా పాటలొ పాలు పంచుకొంది. అది చూసి మా నాన్నగారికి మహదానందమయింది. ఆయన తన చోటునుంచి లేచి దాసగణుగారి దగ్గరకి వెళ్ళారు. ఆయన స్పృహలో లేరు. ఒక విథమైన పరవశత్వంలో ఉన్నారు. మా న్నాన్నగారు ఆయనని రెండు చేతులతో పట్టుకుని పాట పాడటం ఆపమని బాబాగారు తమని ప్రాణ భయాన్నించి రక్షించారని చెప్పారు. పాట ఆగింది. భిల్లులు లేచి నిలబడ్డారు. వారు ఆ శవాన్ని (యిక అది శవం కాదు) తనంత తానుగా నిలబడేందుకు సహాయం చేశారు. వారు అతనితో దాసగణుకి వంగి నమస్కారం చేయమని చెప్పారు. తరువాత బాబాగారి గురించి పుర్తి వివరాలు అడిగి తెలుసుకుని తాము వారి దర్శనానికి షిరిడీ వస్తామని మాట యిచ్చారు.

మరునాడు, దాసగణు, మానాన్నగారు ద్వారకామాయికి వెళ్ళినప్పుడు, బాబా " హే గన్యా ! నిన్న నా భావూ నీతో కూడా ఉన్నాడు, లేకపోతే ఆ భిల్లుల ఆగ్రహావేశాలనుండి నిన్నెవరు రక్షించేది?" యిది వినగానే యిద్దరూ బాబాతో అదంతా ఆయన సృష్టించిందేనని, అటువంటి పరిస్తితుల్లో తాము పూర్తిగా ఆయన మీదే ఆథార పడ్డామని, యెల్లప్పుడు ఆయన యొక్క దయ, ఆశీర్వాదముల జల్లు తమ మీద కురిపిస్తూ ఉండాలని అన్నారు.

ప్రియ పాఠకులారా యిక్కడ మీకు చాలా అనుమానాలు వచ్చి ఉండవచ్చు. నేను మిమ్మలిని వేడుకునేదేమంటే దయ చేసి దీనిని నమ్మండి ఆ శవం నిజంగా చనిపోయి ఉండకపోవచ్చు. కాని కోమాలో ఉంది. ముఖ్యమైన దేమిటంటే హరికథ చెప్పేటప్పుడు యేమి జరుగుతుందనేది బాబాకి ముందే తెలుసు లేక అదంతా దాసగణులో నమ్మకాన్ని గ్రహించుకునేలా చేయడానికి ఆయన సృష్టించినది కావచ్చు. మానవాళిని తన వైపుకు యెలా లాక్కోవాలో బాబాకి బాగా తెలుసు. యిదిలా జరుగుతూనే వుంటుంది. మనం ఆయనపై ఢృఢమైన నమ్మకాన్ని ఉంచుకోవాలి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు



సాయి బంథువులారా ఈ లీలను చదివారు కదా. ఇందులో రచయిత శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ గారు చెప్పినట్లు, పాడె మీదున్న వ్యక్తి కోమాలోనే ఉండి ఉండవచ్చు. బాబావారికి అది ముందే తెలుసు. ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. బాబా యే కనక ఆ భిల్ల వ్యక్తిని రక్షించకపోతే అనవసరంగా ఆ భిల్లులు అతనిని సమాథి చేసి ఉండేవారు. బాబా కి ముందే తెలుసును కనక దాసుగణూ కూడా, భావూ ని పంపి రాబోయే ప్రమాదాన్ని ఆపి ఒక ప్రాణాన్ని రక్షించారు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



షిరిడీలో కుండపోతవానలో మృత్యువునెదుర్కొనుట

0 comments Posted by tyagaraju on 12:47 AM



04.08.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు శుభాశీస్సులు


ఈ రోజు తార్ఖడ్ వారి మరియొక అనుభూతిని గురించి తెలుసుకుందాము.



షిరిడీలో కుండపోతవానలో మృత్యువునెదుర్కొనుట


ప్రియ సాయి బంథు పాఠకులారా, మీరు ఒక్కసారయినా షిరిడీకి వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. యిప్పటి షిరిడీకి, యింతకుముందు సవత్సరాలలో మా నాన్నగారు వెడుతూండేటప్పటి షిరిడీకి చాలా మార్పు వచ్చింది. మీరు షిరిడీలో ప్రవేశించదానికి కోపర్గావ్ పొలిమేరకు వచ్చినపుదు అక్కడ ఒక వాగు ఉంది. షిరిడీ గ్రామంలోకి రావాలంటే ఆ వాగును దాటాలి. సంవత్సరంలో యెక్కువ సార్లు వాగు యెండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే వాగు వేగంగా ప్రవహిస్తూ ఉండటం చూడచ్చు. యిప్పుడు ప్రథాన రహదారికి దానిమీద చిన్న వంతెన ఉంది. ఆ రోజులలో గ్రామస్థులు ఉదయాన్నే తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి యీ వాగు ఒడ్డుకు వస్తూ ఉండేవారు. అందుచేత, అక్కడ చాలా పొదలు ఉండటంతో సూర్యోదయానికి ముందు ఆ ప్రదేశం అనువుగా ఉండేది. రోడ్డుమీద జనసంచారం కూడా ఉండేది కాదు.
మా నాన్నగారు షిరిడీలో ఉన్నపుడు అవి వర్షాకాలం రోజులు ఆయనకు వేకువజామునే లేవడం అలవాటు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత, కాకడ ఆరతికి వెళ్ళేవారు. అటువంటి రోజులలో ఒకనాడు ఆయన వేదువజాముననే లేచి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాగు ఒడ్డుకు వెళ్ళారు. అప్పుడు బాగా ముసురు పట్టి జడివాన కురుస్తూండటంతో తనతో కూడా గొడుగు, టార్చ్ లైటు తీసుకుని వెళ్ళారు.


ఈ విథంగా ఆయన ఆ పరిస్థితిలో ఉండగా వాగు ఒడ్డుకు అవతలివైపునుంచి యెవరో గట్టిగా అరుస్తూ ఉండటం విన్నారు. ముందర ఆయన ఆ అరుపులని పట్టించుకోలేదు. ఆ వ్యక్తి యెక్కడ ఉన్నాడో చూద్దామని ప్రయత్నించారు గాని చీకటిగా ఉండటం వల్ల యెవరినీ చూడలేకపోయారు. ఆ మనిషి ఒడ్డు దగ్గరనుంచి పరుగెత్తుకుని వెళ్ళిపొమ్మని అరుస్తున్నట్లుగా అర్థమయింది. అతను మరాఠీలో "లోంధా అలారే అలా పాలా" అని అరుస్తున్నాడు. మా నాన్నగారికి లోధా అంటే దాని అర్థం తెలీలేదు. (కెరటం)

ఆయన విద్యాభ్యాసం ఆంగ్ల మాథ్యమంలో జరిగింది కాబట్టి వాడుక భాషలో మాట్లాడే మరాఠీ భాషని అర్థం చేసుకోవడానికి ఆయనకు కష్టమయింది. యేమయినప్పటికి ఆ మనిషి అక్కడున్న వారినందరినీ ఆ ప్రదేశం వదలి పరిగెత్తుకుని వెళ్ళమని హెచ్చరిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఆయన హడావిడిగా కాలకృత్యాలను ముగించుకుని పైకి లేచి నుంచుని, చుట్టూ యేమి జరుగుతోందో చూద్దామని టార్చ్ లైట్ వేశారు. 15, 20 అడుగుల యెత్తులో నల్లటి రంగులో నీరు తనవైపుకు వస్తూ ఉండటం వెంటనే గ్రహించారు. రాత్రి సమయంలో యెక్కడో విపరీతమైన కుండపోత వర్షం వచ్చి దాని కారణంగా వాగులో హటాత్తుగా వరద వచ్చింది.

తనకి చావు దగ్గర పడిందని ఆయనకు అర్థమయి గట్టిగా "బాబా మేలో మాలా వఛావా" అని అరిచారు. (బాబా నేను చనిపోతున్నాను దయ చేసి నన్ను రక్షించు) ఆయన కళ్ళు మూసుకుని అక్కడే ఆ సమయమంతా బాబా నామస్మరణ చేస్తూ అదే చోట నుంచుని వున్నారు. కొంత సేపటి తరువాత తాను కొట్టుకుని వెళ్ళిపోలేదని, బతికేఉన్నానని అర్థమయింది. ఆయన కళ్ళు తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు. నీటి ప్రవాహం రెండు పాయలుగా విడిపోయి తనని తాకకుండా తనముందునుంచి వేగగా వెడుతోంది. ఆయన యింకా ఆ నీటి ప్రవాహంలోనే ఉన్నారు. ఆయనకి చావు భయం పట్టుకుంది. ఆ సమయమంతా బాబా నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. కొంత సేపటి తరువాత నీటిమట్టం తగ్గింది. అది మోకాలు లోతుకు వచ్చేటప్పటికి నీరు ఆయన శరీరాన్ని తాకింది. యిప్పుడాయన మోకాలిలోతు నీటిలో ఉన్నారు. ప్రవహించే వరద నీటిలో తన చుట్టూరా చెట్ల కొమ్మలు, పొదలు, జంతుజాలాలు వగైరా కొట్టుకుని పోవడం చూశారు. అక్కడికక్కడే ఆయన బాబాకు థన్యవాదాలు తెలిపి, అటువంటి చావు పరిస్థితి నుంచి బాబాయే కాపాడారని అర్థం చేసుకున్నారు. . అప్పుడాయన మెల్లగా ఆ మోకాలి లోతు నీటిలో వెనకకు నడిచారు. ఆయన తమ బస వద్దకు వచ్చి, స్నానం చేశారు. ఆ ఉదయం ఆయన కాకడ ఆరతిని చూసే అదృష్టాన్ని పోగొట్టుకున్నారని వేరే చెప్పనక్కరలేదు. ఆ ఉదయం జరిగినదంతా తన తల్లికి చెప్పారు. ఆయనని మృత్యు కోరలనుంచి బాబాయే లాగారని, తనకి ప్రాణ భిక్ష పెట్టినందుకు వెంటనే వెళ్ళి ఆయనకు థన్యవాదములు తెలపమని ఆవిడ సలహా ఇచ్చింది. ఆయన వెంటనే ద్వారకామాయికి వెళ్ళి, తన చేతిలో పూజా సామాగ్రితో మెట్లు యెక్కుతూండగా బాబా రెట్టించిన స్వరంతో "ఏయ్ భావూ ! యివాళ పొద్దున్నే నా సహాయం కోసం యెందుకరిచావు? చనిపోతావని భయం వేసిందా?" అన్నారు. మా నాన్నగారు ఆయన కాళ్ళ మీద పడి బాబాతో "మీకంతా తెలుసు. నాలాంటి సామాన్య మానవుడు చావు తథ్యమని కళ్ళెదుట కనపడుతూ ఉంటే భయపడటం సహజం" అన్నారు. బాబా ఆయనని భుజాలు పట్టుకుని లేవనెత్తి "ఏయ్ భావూ, పైకి లే, నేను నిన్ను చావడానికి షిరిడీ తీసుకు రాలేదు. దయ చేసి గుర్తుంచుకో నువ్వింత సులభంగా ఈ విథింగా చావవు. భవిష్యత్తులో నువ్వు చేయవలసిన పని యెంతో ఉంది" అన్నారు.


ప్రియమైన సాయి భక్త పాఠకులారా, మనలాంటి సామాన్యమానవులకి అటువంటి అనుభవాలని అర్థం చేకోవడం కష్టమని నాకు తెలుసు. అప్పుడు నా జీవితంలోఆలోచనా శక్తిని రేకెత్తించే సంఘటన ఒకటి జరిగింది. దానిని నేనిప్పుడు మీకు వివరిస్తాను.


నాకు బాగా గుర్తున్నంత వరకు అది 1962 సం. జూన్ నెల. బాంద్రాలో న్యూ టాకీస్ లో (యిప్పుడది గ్లోబస్ థియేటర్) గొప్ప సినిమా ఆడుతోంది. ఆ సినిమా పేరు "టెన్ కమాన్ డ్ మెంట్స్". ఈ సినిమాకి నిర్మాత సెసెల్లె బెడెమెలె, హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. కొలాబాలోని రీగల్ థియేటర్లో 70 ఎం.ఎం. స్క్రీన్, స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తిరిగి నిర్మించవడిన బాంద్రాలోని న్యూ టాకీస్ లోను గత రికార్డులన్నీ ఈ సినిమా బద్దలు కొట్టింది. నేను ఈ సినిమాని చూశాను. నాకు తెలిసిన దేమిటంటే, ఈ సినిమాలో చూపించిన అద్భుతాలు, మానాన్నగారు షిరిడీలో సాయిబాబాతో ఉండగా చూసిన లీలలు రెండూ కూడా సరిపోలాయి. మా నాన్నగారిని నాతో కూడా వచ్చిఈ సినిమాను చూడమని ఒప్పించాను. 30 నుంచి 35 సంవత్సరాల తరువాత అయిఉండవచ్చు, ఆయన థియేటర్ లోకి అడుగుపెట్టి సినిమా చూశారు. ఆయన చూసిన దృశ్యాలు, దైవ సంబంథమైన దివ్యమైన వెలుతురు, (ప్రకాశం) పర్వతాన్ని దర్శించడానికి వచ్చినపుడు మోజెస్ రావడం, ఈజిప్టు భూబాగాన్ని వదలి వెళ్ళే తన జ్యూ ప్రజలందరినీ మోజెస్ తీసుకుని వెళ్ళడం, రెడ్ సీ ఒడ్డుకు వచ్చి ప్రభువుని ప్రార్థించడం, ఫరోహా రాజు ఆగ్రహం నుంచి వారిని తప్పించడానికి సముద్రం రెండు భాగాలుగా విడిపోవడం, మానాన్నగారు ఆ పిక్చరైజేషన్ కి అమితానంద పడ్డారు. కళ్ళనుండి కన్నీరు పెల్లుబికి థారగా కార సాగాయి. మేము థియేటర్ నించి బయటకువచ్చిన తరువాత టెన్ కమాండ్ మెంట్స్ సినిమాలో చూపించిన విథంగా షిరిడీ సాయిబాబా వారికి కూడా అదే విథమయిన మానవాతీత శక్తులు కలిగి ఉన్నారని, మోజెస్ పాత్రకి, ఆయనకి బాగా పోలిక ఉందని నిర్థారించారు. ఆయన యింకా కొనసాగిస్తూ యిలా చెప్పారు. "వీరేన్! షిరిడీ సాయిబాబాతో ఉన్నపుడు నేననుభవించిన అపూర్వమైన అనుభవాలని నమ్మడానికి నీకిప్పుడు తగిన కారణం ఉంది."


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


------------------------------------------------------------

నేను డిగ్రీ చదివే రోజులలో "ది టెన్ కమాండ్ మెంట్స్" సినిమా చూశాను. సముద్రం రెండుగా విడిపోయి దారి ఇవ్వడం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఒకవేళ యెవరినా చూడకపోతే చూడండి.


Tuesday, August 2, 2011

పండరిపూర్ లార్డ్ విఠోభా

0 comments Posted by tyagaraju on 11:59 PM

03.08.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు


దేవాలయాల్లో మనము దర్శిస్తున్న విగ్రహాలని రాతి విగ్రహాలనుకుంటాము. కాని అవి సజీవం గా ఉన్న విగ్రహాలు. దేవాలయాలలో ప్రతిష్టించేముందు వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు కాబట్టే వాటిలో జీవం ఉంటుంది. వాటిలో జీవకళ తొణికసలాడుతూ ఉంటుందై. అందుచేత మనం యెప్పుడు గుడికి వెళ్ళినా ఆ కాసేపయినా మిగతా విషయాలను పక్కకు పెట్టి మనస్పూర్తిగా ఆ దేవదేవుడిని మనసారా నిండుగా ప్రార్థించుకోవాలి. ఆయన అనుగ్రహాన్ని పొందాలి. దానికి నిర్థారణగా ఈ రోజు మనం తార్ఖడ్ వారి స్వీయానుభూతులలో పండరీపురం గురించిన అద్భుతమైన లీలను తెలుసుకుందాము.




పండరిపూర్ లార్డ్ విఠోభా


ప్రియమైన సాయి భక్త పాఠకులారా ! మా నాన్నగారనుభూతి పొందిన సంఘటనలన్నీ కాలక్రమానుసారం నా వద్ద లేనందుకు, దయ చేసి నన్ను మన్నించమని కోరుతున్నాను. నా మనసులోకి వచ్చిన వాటి ప్రకారం నేను వాటిని వివరిస్తున్నాను. మా నాన్నగారు ఆథ్యాత్మిక స్థితిలోకి వెళ్ళినపుడెల్లా వాటిని మాకు వివరిస్తూ ఉండేవారు. అందుచేత చేత క్రమంలో చెప్పడం నాకు సాథ్యం కాదు.

యింతకుముందు చెప్పినట్లుగా, తార్ఖడ్ కుటుంబమంతా ప్రతిరోజూ సాయిబాబాని పూజించడం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వారందరూ కలిసి తమ యింటిలో ఆరతి యిస్తూ ఉండేవారు. మా నానమ్మగారు పూర్తి మనశ్శాంతితో ఉన్నారు. ఆవిడ తన తలనొప్పి పూర్తిగా నివారణ అవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఆవిడ యిపుడు ఆథ్యాత్మికత వైపుకు ఆకర్షిలవుతున్నారు. ఆమె ప్రతిరోజూ ఆథ్యాత్మిక పుస్తకాలను చదవడం ప్రారంభించారు. ఒక సారి ఆమె మా నాన్నగారితో పవిత్రమైన పండరీపుర క్షేత్రానికి యాత్రకు వెళ్ళి లార్డ్ విఠోబా దర్శనం చేసుకోవాలనే కోరికను వెల్లడించారు. ఆమె యింకా ఏమి చెప్పిందంటే పవిత్ర గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం ప్రతివారు ఈ ప్రపంచాన్ని వదలివెళ్ళేముందు పండరీపూర్ ను తప్పక దర్శించాలని. మానాన్నగారు బాబాని అడిగి అయన అనుమతి తీసుకోమని చెప్పారు.



ఆ ప్రకారంగా, తరువాత షిరిడీకి వెళ్ళినప్పుడు, ఆవిడ పండరీపూర్ దర్శించడానికి బాబా అనుమతి కోరారు. బాబా ఆవిడతో "అమ్మా! షిర్డీయే మనకన్నీ. అందుచేత అవసరం లేదు." అన్నారు. ఆవిడ నిరాశ పడ్డారు. ఆమె బాబాతో యాత్రికులు పండరీపురం వెడుతూ ఉంటారని, యెందుకంటే లార్డ్ విఠోబా అక్కడ కొలువైఉన్నారని, ఒక్కసారి ఆయనని దర్శనం చేసుకుంటే మోక్షానికి దారి సుగమం అవుతుందని వారి గట్టి నమ్మకమని చెప్పారు.


ఆవిడకి తన జీవితంలో ఒక్కసారయినా వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలనే గాఢమయిన కోరిక పెరిగిందని వ్యక్తం చేశారు. బాబాగారు ఆవిడ కోరిక సమంజసమయినదేనని తెలిసి "అమ్మా, చింతించవద్దు. నువ్వు పండరీపురం వెళ్ళి నీ కోరిక తీర్చుకో" అని అనుమతించారు. యింటికి చేరుకోగానే బాబా సాహెబ్ తార్ఖడ్ గారికి చెప్పి సరియైన ప్రణాళిక వేసుకుని మానాన్నగారు, మా నాన్నమ్మగారు పండరీపురానికి ప్రయాణం కట్టారు. పాఠకులు ఒక విషయాన్ని మెచ్చుకోవాలి. అదేమిటంటే ముస్లింస్ కి మక్కా, కాథలిక్స్ కి బెథల్ హాం యెలాగో, అలాగే మహారాస్ట్రులకు పండరీపూర్.


అక్కడికి చేరుకోగానే మా నాన్నగారు, అవసరమయిన అన్ని యేర్పాట్లూ చేశారు.


స్నానాలు చేసి, పలహారం తీసుకున్న తరువాత, ఉదయం రద్దీ గంటలు అయిపోయాక వారు పూజా సామాగ్రితో విఠోబా మందిరం వరకు నడచుకుంటూ వెళ్ళారు.
గర్భ గుడిలోకి ప్రవేశించగానే మందిర పూజారిగారిని పూజ జరుపుకోవడానికి అనుమతి కోరారు. మా నానమ్మగారు ఆమె పథ్థతి ప్రకారం దాదాపు పూజనంతా పూర్తి చేశారు. యిపుడు విఠోబా విగ్రహానికి దండ వేసి అలంకరించే సమయం. యిక అక్కడే సమస్య యెదురయింది. మా నాన్నమ్మగారు తాను స్వయంగా తన చేతులతో దండ వేస్తానన్నారు. కాని పూజారి అలా చేయడానికి అనుమతించలేదు, కారణం విగ్రహం ఉన్న పీఠం మీదకు యెక్కడానికి యెవరికీ కూడా అనుజ్ఞ లేదు. మా నాన్నమ్మగారు, విగ్రహానికి తన చేతులతో దండ వేయలేకపోతే తన పూజ అసంపూర్తిగా మిగిలి పోతుందని మా నాన్నగారితో చెప్పారు. మా నాన్నగారు బాబాగారే ఆమెకు పండరీపురం వెళ్ళడానికి అనుమతిచ్చారు కాబట్టి ఆయననే సహాయం చేయమని ప్రార్థించమని సలహా ఇచ్చారు. ఆవిడ కళ్ళు మూసుకుని దండ పట్టుకుని రెండు చేతులను పైకెత్తి లార్డ్ విఠోబా కు తన పూజను స్వీకరించమని కోరారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ....ఊపిరి బిగపెట్టండి.....ఏమి జరిగిందో చూడండి.........లార్డ్ విఠోబావిగ్రహం పీఠం మీదనించి కిందకు దిగింది. మా నాన్నగారు వెంటనే మా నాన్నమ్మగారి శరీరాన్ని కుదిపారు. ఆవిడతో కళ్ళు తెరవమని, లార్డ్ విఠోబా ఆమె ప్రార్థనలకు స్పందించారని యిప్పుడామె ఆయనని దండతో అలంకరించవచ్చని, చూడమని చెప్పారు. ఆవిడ వెంటనే విఠోబా మెడలో దండ వేశారు. తరువాత లార్డ్ విఠోబావిగ్రహం తన యథాస్థానానికి వెళ్ళింది. తల్లీ, కొడుకులిద్దరూ లార్డ్ విఠోబా ముందు సాష్టాంగ నమస్కారం చేశారు.


యిది చూసి పూజారిగారు ఆశ్చర్యచకితులై ఆయన పీఠం మీదనించి కిందకి ఉరికి మా నాన్నమ్మగారి , నాన్నగారి కాళ్ళు పట్టుకుని వారే విఠోబా, రుక్మిణి అని వారిని అక్కడినించి వెళ్ళనివ్వనని చేప్పేశారు.తన అహంకార ప్రవర్తనకి క్షమించమని అడిగారు. మా నాన్నగారు ఆయనను ఓదార్చి తమగురించి యెటువంటి తప్పుడు అభిప్రాయాలుపెట్టుకోవద్దని చెప్పారు. వారు, తాము షిరిడీ సాయిబాబా భక్తులమని, వారి అనుమతి తీసుకున్న తరువాతే పండరీపురానికి వచ్చామని చెప్పారు. ఆయన కింకా, లార్డ్ విఠోబా మీద ఢృఢమైన నమ్మకముంచమని, ఆయన యిక రాతి విగ్రహం కాదు జాగృదావస్థలో (సజీవంగా) ఉన్నరని చెప్పారు. హృదయాంతరాళలో నుంచి పూజ నిర్వహించి ప్రతిగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించమని ఆయన సలహా యిచ్చారు. ప్రసాదం యిస్తే తాము మందిరం నిం చి వెడతామని పూజారిగారిని కోరారు. వారు విఠోబా, రుక్మిణిల యిత్తడి విగ్రహాలను కొన్నారు. వాటిని తమ చందనపుమందిరంలో ప్రతీరోజూ పూజచేయడానికి ఉంచారు.

ఈ అనుభవం వారిద్దరికీ స్వర్గంలో ఉన్నంత సంతోషాన్ని కలిగించింది. వారు భగవంతునికి తమ ప్రార్థనలను యెంతో విధేయతగా సలుపుతున్నపాటికీ, లార్డ్ విఠోబా తమను అంతలా అనుగ్రహిస్తారని వారెప్పుడూ ఊహించలేదు. దీని తరువాత వారు షిరిడీకి వెళ్ళినప్పుడు, బాబా మా నాన్నమ్మగారిని అడిగారు "అమ్మా, విఠోబాని కలుసుకోగలిగావా" అని. "బాబా, యిదంతా నువ్వు చేసినదే" అని మా నాన్నమ్మగారు సమాథానమిచ్చారు. "యిప్పుడు నా జీవితానికి సార్థకత యేర్పడింది. నేనిపుడు ప్రపంచాన్ని వదలిపోవడానికి సిథ్థంగా ఉన్నాను" అని చెప్పారు. ఆవిడ యెంతో కృతజ్ఞతలు తెలిపారు.


ప్రియ సాయి భక్తులారా, పాఠకులారా ! మా నాన్నగారు చెబుతూ ఉండేవారు, మీరు పూజించే ప్రతి రాతి విగ్రహంలోను భగవంతుడు యెపుడూ ఉంటాడని. నేను గాఢంగా నమ్మేదేమిటంటే వారనుభవించిన ఈ దైవ సంబంథమయిన అనుభూతులన్నీ వారు తమ పూర్వ జన్మలో చేసుకున్న మంచి పనులవల్లనేనని, యింకా

అనుమానంలేకుండా వారు సాయి దయ, ఆశీర్వాదములు అనే ఛత్రం కింద ఉన్నారు కనక యిదంతా సాథ్యమయింది.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Monday, August 1, 2011

మాయి ఆయి దేవత భయంకర దృశ్యం

0 comments Posted by tyagaraju on 10:52 PM



02.08.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు జ్యోతీంద్ర గారి మరొక అనుభవాన్ని తెలుసుకుందాము.



మాయి ఆయి దేవత భయంకర దృశ్యం


ప్రియ సాయి భక్త పాఠకులారా ! మనం 21 వ శతాబ్దంలో పయనిస్తున్నాము. నేను కొద్ది సేపటిలో మీకు వివరించబోయే జ్యోతీంద్ర గారి అనుభవంలో నమ్మకముంచమని మిమ్మలిని సవినయంగా కోరుతున్నాను. ఒకసారి షిరిడీలో కలరా వ్యాపించిందని సాయి సచ్చరిత్ర చదివినవారికందరకూ తెలుసు. అటువంటి అంటువ్యాథి ప్రబలినపుడు, మరణాలని అదుపులో వుంచాలంటే మారి ఆయి (అమ్మవారిని) ప్రార్థించాలని గ్రామస్థులు నమ్మేవారు. ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు అప్పటికింకా రాలేదు, యిప్పటిలాగా అభివృథ్తి చెందలేదు. అందుచేత గ్రామాల్లో అంటువ్యాథులనేవి సాథారణ విషయం. ప్రచార సాథనాలు కూడా అభివృథ్థి చెందలేదు. ఆ కారణం చేత మా నాన్నగారు షిరిడీ చేరుకునేటప్పటికి షిరిడిలో కలరా అంటువ్యాథి ఉందని తెలీలేదు. అప్పటికీ ఆయనకు బాబా మీద నమ్మకం యేర్పడినందు వల్ల, షిరిడీలో వుండటం చాలా ప్రమాదకరమయితే బాబాగారే వెంటనే బొంబాయికి వెళ్ళమని చెప్పి తన గురించి జాగ్రత్తలు తీసుకుంటారని తెలుసు. అందుచేత ఆయన భయం లేకుండా మామూలుగానే పూజాదికాలు నిర్వర్తించారు. తరువాత రెండు, మూదు రోజులలో మరణాల రేటు పెరిగిపోవడం, షిరిడీ చుట్టుప్రక్కల గ్రామలలో కలరా భయంకరంగా విజృంభించడం ఆయనకు అనుభవమయింది. ఆయన మనస్సులో బాగా భయపడిపోయారు. ఒక సాయంత్రం తన విథి నిర్వహణ ప్రకారం పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి ద్వారకామాయిలో పెడుతున్నారు.




యెప్పుడయితే ఆయన, బాబా గారు సాథారణంగా థుని ముందు కూర్చునే ప్రదేశంలోని మెట్లు యెక్కారో అప్పుడు ఆయన మీద బాబా గారు బాగా ఉగ్రుడయ్యారు. ఆయన బాగా తిట్టడం మొదలుపెట్టారు. జ్యోతీంద్రగారి కది కొత్త అనుభవం. బాబా గారి కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. విపరీతమయిన కోపంతో ఆయన మానాన్నగారిని ఏడు ముక్కలుగా నరికి మసీదులో పాతిపెట్టేస్తానని అన్నారు. జ్యోతీంద్ర బాగా భయపడిపోయారు. ఆయన బాబా కాళ్ళమీద పడి, తాను ఏదో తెలియక తప్పు చేసి ఉండవచ్చని అదే బాబా కోపానికి కారణమయి ఉంటుందని తలచి, క్షమించమని అర్థించడం మొదలుపెట్టారు. బాబా గారు అదే స్థితిలో ఉండి ఆయనని అక్కడే కూర్చుని తన కాళ్ళు నొక్కమని ఆదేశించారు. మా నాన్నగారు వెంటనే ఆయన ఆజ్ఞను శిరసా వహించి ఆయన పాదాల వద్ద కూర్చుని కాళ్ళు నొక్కసాగారు. బాబా యింకా ఏదో గొణుగుతూ ఉండటం, యింకా అదే కోప స్వ్వభావంలో ఉండటం గమనించారు. కొంతసేపటి తరువాత జ్యోతీద్రగారికి చెమటలు పట్టడం మొదలైంది. కారణం తనముందు భయంకరమైన రూపంతో కాళికాదేవిని చూశారు. ఆమె రూపం నాలికంతా రక్తంతో తడిసి భయంకరంగా ఉంది.



ఈ దృశ్యం చూసేటప్పటికి మా నాన్నగారికి పూర్తిగా స్ప్రుహ పోయింది. యాంత్రికంగా ఆయన తన శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుని బాబా కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఆయన తనను రక్షించమని బాబాకి చెబుదామని ప్రయత్నిస్తున్నారు కాని, నోటంబట మాట రాకుండా వుండేటంతగా విపరీతమయిన భయంతో మాటలురానివాడిగా అయిపోయారు. ఆయన మొహం రెండు వైపుల మాత్రమే తిరుగుతోంది, బాబా మీంచి కాళీ మీదకి, కాళీమీదనించి బాబా మీదకి. ఏదో గొణుగుతున్న బాబాని చూస్తున్నారు. వినపడకుండా అర్థం కానట్లుగా ఉంది. వెంటనే అచేతనంగా అయిపోయారు. మెలకువ వచ్చేటప్పటికి బాబా తనని కుదుపుతూ లేపి అడుగుతున్నారని తెలిసింది.


తిరిగి తెలివి తెచ్చుకుని పూర్తిగా చెమటతో తడిసిపోయారు. బాబా ఆయనతో "ఏయ్ భావూ ! నేను నీకు నా కాళ్ళు నొక్కమని చెప్పాను. నువ్వు వాటిని యెంత గట్టిగా పట్తుకున్నావంటే నీ గోళ్ళు నన్ను బాథిస్తున్నాయి" అన్నారు. మా నాన్నాగారికి బాగా దాహంగా ఉండి మంచినీళ్ళు అడిగారు. బాబా , ద్వారకామాయిలో యెప్పుడూ ఉంచబడే కుండ (కొళంబే) లోని నీరు కొంచెం ఇచ్చారు. మా నాన్నగారు మంచినీళ్ళు తాగి యథాస్థితికి వచ్చారు. ఆయన వెంటనే తనకు అటువంటి భయానక దృశ్యాలను చూపవద్దని, చూసి తట్టుకునే ఢైర్యం తనకు లేదని బాబాతో చెప్పారు. తరువాత నాలుగు రోజులు తను తిండి కూడా తినలేనని షిరిడీ రావాలా వద్దా అని కూడా తిరిగి అలోచించవలసివస్తుందని బాబాతో అన్నారు. అప్పుడు బాబా "హే భావూ! నువ్వు సరిగ్గా యేమి చూశావో చెప్పు" అన్నారు. మా నాన్నగారికి యింకా బాగా గుర్తుంతుండటం వల్ల జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పారు. ఆయన బాబాతో అన్నారు "మీరు ఆ భయంకరంగా ఉన్నామెతో ఏదో గొణుగుతున్నారు. కాని నేను స్ప్రుహ లేకుండా ఉండటంతో నేనేమీ వినలేక పోయాను."

బాబా సమాథానం చెప్పారు " ఏయ్ ! బావూ! నువ్వు చెబుతున్న ఆ భయంకరంగా ఉన్నామె అమ్మవారు తప్ప మరెవరూ కాదు. ఆవిడ నీ ప్రాణాన్ని అడుగుతోంది. నేను తిరస్కరిస్తున్నాను. ఆమె వెళ్ళిపోవడానికి నిరాకరిస్తోంది. నేనప్పుడామెతో కావాలంటే మరొక అయిదు మందిని తీసుకుని వెళ్ళు, నేను నా భావూనివ్వను" అన్నాను. ఆఖరికి ఆవిడ విరమించుకుని ద్వారకామాయిని వదలి వెళ్ళిపోయింది. బాబా యింకా చెప్పడం మొదలు పెట్టారు, "భావూ, గుర్తుంచుకో నువ్వు చావడానికి నిన్ను నేను షిరిడీకి రప్పించను. నువ్వు నా పాదాల వద్ద ఉన్నపుడు యెవరూ కూడా నిన్ను నా వద్దనుంచి లాక్కుని వెళ్ళలేరు."


మా నాన్నగారికది పునర్జన్మ అనిపించింది. ఆయన బాబా పాదాల మీద పడి, తనకటువంటి భయానక దృశ్యాలను చూపించవద్దని, తట్టుకోవడం తన శక్తికి మించిన పని అని మరొకసారి అర్థించారు. మా నాన్నగారు ఆ సంఘటన గురించి వివరించినపుడెల్లా, ఆ భయంకర దృశ్యాన్ని గుర్తు చెసుకున్నపుడు రాత్రి ఆయనకి నిద్ర పట్టేది కాదు.


ప్రియమైన సాయి భక్తులారా, ఈ ఉపాఖ్యానాన్ని చదివిన తరువాత మీకుకొన్ని అనుమానాలు కలుగుతాయని నాకు బాగా తెలుసు. మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారనీ నాకు తెలుసు. కాని ముందరే నేను చెప్పినట్లు మీరు నమ్మండి. షిరిడీ సాయిబాబా భగవంతుని అవతారం తప్ప మరేమీ కాదు. అందుచేత ఆయనకి మానవాతీత శక్తులున్నాయి. అవసరమయినపుడు భక్తులను రక్షించడానికి వాటినాయన ఉపయోగిస్తూఉంటారు. అటువంటి ప్రాణ భిక్ష పెట్టబడిన అనుభవాలు కలిగినవారు యెంతోమంది ఉండవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దుష్ట శక్తులనుంచి తన భక్తులను రక్షించడం తన ముఖ్య కర్తవ్యమని బాబా చెబుతూ ఉండేవారు.


ఆయన మానాన్నగారితో "భావూ ! షిరిడీనుంచి నేను నా భౌతిక దేహాన్ని విడిచిన తరువాత, షిరిడీకి ప్రజలు చీమల బారులా వస్తారు. యింకా గుర్తుంచుకో ఈ ద్వారకామాయినుంచి మాటలాడేటప్పుడు నేను అసత్యం పలుకను".


ప్రియమైన పాఠకులారా ఈ 21 వ.శతాబ్దంలో షిరిడీలో ఏమి జరిగిందన్నది మనమంతా చూస్తున్నాము, అనుభూతి చెందుతున్నాము, ఈ ప్రపంచం అంతమయేంత వరకు యిదిలా జరుగుతూనే ఉంటుందని నాకు తెలుసు.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


Sunday, July 31, 2011

గణేష్ విగ్రహాన్ని రక్షించిన సాయి

0 comments Posted by tyagaraju on 9:43 PM






01,08.2011 సోమవారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా వారు గణేష్ విగ్రహాన్ని యెలా రక్షించారో తెలుసుకుందాము.



గణేష్ విగ్రహాన్ని రక్షించిన సాయి

ఓం సాయినాథాయనమహ

చందనపు మందిరంలో గణేష్ జీ చిన్న పాలరాతి విగ్రహం కూడా ఉంది. యిది ఒక అపూర్వమైన విగ్రహం. యెందుకంటే వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంది. విగ్రహం వెండి సిం హాసనంలో ఉంది. దానికి అది ప్రత్యేకంగా తయారుచేయబడింది. గణేష్ మూర్తి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుచేత పాఠకులందరికీ దానిని గురించి చెబుతాను. గణేష్ మూర్తి చాలా కాలం నించీ వుంది. దీనికి సంబంథించిన గొప్పతనమంతా బాబాకే చెందుతుంది.

మా తాతగారు బొంబాయి రీగల్ థియేటర్ దగ్గిర పురాతన వస్తువులు అమ్మే దుకాణానికి వెడుతూ ఉండేవారు. ఒక సారి అల్లా వెళ్ళినపుడు, షాపు యజమానితో ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటం వినపడింది. ఒక ఆంగ్లేయుడు బేరమాడుతూ ఉండటంతో మా తాతగారికి కుతూహలం కలిగి, ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టారు. ఆ బేరం అందమైన పాలరాతి గణేష్ విగ్రహం గురించి జరుగుతోంది. అది 9 అంగుళాల పొడవుతో పద్మంలో కూర్చుని ఉండి దానికి తగ్గ రకరకాల రంగులతో రంగు వేయబడి ఉంది.


షాపతను థర రూ.15/- చెప్పాడు. అది సోమనాథ్ మందిరం నించి వచ్చిన చాలా పురాతనమైనదని అందు చేతనే దానికి అంత థర న్యాయమైనదని చెప్పాడు. ఆంగ్లేయుడు దానికి రూ.5/- నుంచి రూ.8/- దాకా ఇవ్వడానికి సిథ్థమయాడు. మా తాతగారు ఆ బేరసారాలకి ఆకర్షితుడై, ఆ విగ్రహంతో యేమి చేయబోతున్నాడో కుతూహలంతో ఆగ్లేయుడిని అడిగాడు. ఆంగ్లేయుడు తానా పాలరాతి విగ్రహాన్ని తన బల్ల మీద పేపర్ వెయిట్ గా వాడుకోవడానికని చెప్పాడు. యిది వినేటప్పటికి మా తాతగారికి చాలా కోపం వచ్చింది. ఆయన తన పర్స్ నుంచి రూ.80/- తీసి షాపతనికిచ్చారు. ఆయన అతనితో రూ.80/- తీసుకొమ్మని ( ఆంగ్లేయుడు ఇస్తానన్నదానికి 80 రెట్లు) ఆ విగ్రహాన్ని తనకు పాక్ చేయమని చెప్పారు. తన దేవుడిని మరెవ్వరూ కూడా పేపర్ వెయిట్ గా ఉపయోగించనివ్వనని వెల్లడించారు. యింకా అడిగిన మీదట ఆ విగ్రహం సోమనాథ్ మందిర ప్రథాన ద్వారం దగ్గర వుండేదని అందుచేతనే అది చాలా పురాతనమైనదని షాపు యజమానినుంచి తెలుసుకున్నారు.


యింటికి వెళ్ళగానే చందనపు మందిరంలో ఉంచి సాయి పూజతో పాటు దానిని కూడా పూజిస్తానని చెప్పారు. యేమయినప్పటికి పేపర్ వెయిట్ గా ఉపయోగించేకంటే అదే చాలా మంచిదనుకున్నారు. కుటుంబంలోని వారంతా ఆయన చెప్పిన సూచనకి అంగీకరించారు. పాకెట్ విప్పగానే మా నానమ్మగారు విగ్రహం యొక్క తొండం కుడివైపుకుతి రిగి ఉందని, యిటువంటి లార్డ్ గణేష్ (సిథ్థివినాయక) సాథారణంగా యింట్లో పూజ కోసం ఉంచుకోకూడదని, యెందుకంటే యింటిలో ఆచార వ్యవహారాలు చాలా ఖచ్చితంగా పాటించాలని తెలుసుకున్నారు. అప్పుడు వారు పూజారిగారిని సంప్రదించగా ఆయన ఒక షరతు ప్రకారమైతే విగ్రహాన్ని పూజించవచ్చు, అదేమిటంటే ప్రతి గణేష్ చతుర్థినాడు దానికి మరలా రంగు వేసి, దానిని నిమజ్జనం చేయకూడదని చెప్పారు. అటువంటి పరిష్కారం సూచించినందుకు తార్ఖడ్ కుటుంబమంతా సంతోషించి, రాబోయే గణేష్ చతుర్థికి విగ్రహానికి వెండి సిం హాసనం తెచ్చి శాస్త్రోక్తంగా దానిని చందనపు మందిరంలో ప్రతిష్టించారు. అప్పటినించి ప్రతి హార్తాలిక కి (గణేష్ చతుర్థికి) ఒక రోజు ముందు మానాన్నగారు విగ్రహానికి టర్పంటైన్ తో పాత రంగుని తొలగించేవారు. తరువాత దానికి పరిమళపు నీటితో (సెంటెడ్ వాటర్) స్నానం చేయించేవారు. మాలో ప్రతి ఒక్కరం కూడా అందులో పాల్గొని దానికి మరలా రంగులు వేసేవాళ్ళము. గణేష్ చతుర్థినాడు, దానిని మరలా వెండి సిం హాసనంలో ప్రతిష్టించేవారు. మేమంతా కలిసి పూజ చేసేవారము. నా చిన్నపుడు నా స్కూలు స్నేహితులు నన్ను మీరు గణపతిని తెచ్చుకున్నారా అని అడుగుతూ ఉండటం నాకు గుర్తు. గణపతి మా యింటిలో శాశ్వతంగా ఉన్నాడని చెబుతూ ఉండేవాడిని. అప్పుడు వారు నన్ను అర్థం చేసుకోలేకపోయేవారు.


అందుచేత తార్ఖడ్ వారంతా ప్రార్థనాసమాజ్ నించి విగ్రహారాథకులుగా మారిపోయారు.

మా యింటిలో ఉన్న ఈ గణేష్ విగ్రహానికి మా నానమ్మగారు ఒకసారి యాసిడ్ టెస్ట్ చేసారు. మా తాతగారికి టెక్స్ టైల్ యిండస్ట్రీలో మంచి పేరుంది. ఆయనకి బరోడా మహరాజావారి నుంచి తమ రాష్ట్రంలో టెక్స్ టైల్ మిల్ స్థాపించే బాథ్యత యివ్వబడింది. అందుచేత వారు బరోడాకి నివాసం మార్చారు. వారికి నది ఒడ్డున ఒక బంగళా వసతి కోసం యిచ్చారు. ఒకసారి వర్షాకాలంలో రాత్రంతా పెద్ద వర్షం కురిసింది. పొద్దున్నకి వారి బంగళా నీటితో నిండి ఉంది. యిది వారికొక కొత్త అనుభవం. గంట గంటకి నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో మా నానమ్మగారు భయపడ్డారు. ఆఖరి మెట్టు తప్ప బంగళా మెట్లన్ని నీటిలో మునిగి పోయిఉన్నాయి. మా నానమ్మగారు అప్పుడు మట్టం సరిగానున్న రాగి పాత్రను తెచ్చి ఆఖరి మెట్టుమీద పెట్టారు. అప్పుడామె వెండి సిం హా సనం నుంచి "విఘ్నహర్త" ని పైకి తీసి రాగి పాత్రలో ఉంచి, విగ్రహం కనక నీటిలో మునిగిపోతే, అదే నీటిలో లార్డ్ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుతానని చెప్పేశారు. అటువంటి ప్రమాదకర పరిస్ఠితినుంచి లార్డ్ తమని రక్షిస్తారనే ధృఢమయిన అబిప్రాయం కావచ్చు ఆవిడది.

బాగా భక్తి భావం ఉన్న ధృఢమయిన భక్తులు మాత్రమే అటువంటి సాహసం, అటువంటి సాహసోపేతమైన చర్యలు చేయగలరు అని నేననుకుంటున్నాను. దేవుడు కూడా అలాంటివారిని యిష్టపడే అవకాశం కూడా ఉంది. నీటిమట్టం యింకా పెరిగి రాగిపాత్రని తాకి, యిక పెరగడం ఆగిపోయింది. 3, 4 గంటల తరువాత నీటిమట్టం తగ్గిపోవడంతో అంతా సంతోషించారు. వారు కోరుకున్న ప్రకారం వారి "విఘ్నర్త" వారిని రక్షించాడు. ఆ సంవత్సరం వారు గణేష్ చతుర్థిని ఒకటిన్నర రోజులకు బదులు అయిదు రోజులు జరుపుకున్నారు.

గణేష్ మూర్తి గురించి మరియొక సంఘటనని వివరించడానికి యింకా కొనసాగిస్తాను.

ఈ సంఘటన ఈ అథ్యాయానికి పెట్టిన పేరుకు కొంత సార్థకత చేకూరుస్తుంది. ఒక హత్రాలికా రోజున మా నానమ్మగారు కాల థర్మం చెదారు. (అనుకోకుండా). ఒక హత్రాలికా రోజున పాత రంగు తీసివేస్తున్నపుడు విగ్రహం యొక్క కుడి చేయి మోచేయి నుండి పట్టు తొలగింది. మా నాన్నగారు చాలా భక్తిపరులు. హిందూ సిథ్థాంతము ప్రకారం పాడయిన విగ్రహాన్ని పూజించరాదని. యేమయినప్పటికి అది యిప్పుడు కుటుంబంలో భాగమయిపోయింది. వారు దానిని వదలుకోవడానికిష్టపడలేదు. వారు పండగలు జరుపుకోవాలని నిర్ణయించుకుని అప్పుడు సాయిబాబా సలహా తీసుకుందామనుకున్నారు. ఆ విథింగా వారు షిరిడీకి బయలుదేరారు. ప్రియ పాఠకులారా అది వారి తప్పు చేస్తున్నట్లు కాదూ? వారెప్పుడు బాబాని లార్డ్ గణేష్ వ్యవహారాల్లో పాల్గొనేలా చేయలేదు. యిపుడు కష్టం వచ్చేటప్పటికి ఆయన సహాయం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో వారు ద్వారకామాయిలో ఉన్నపుడు బాబా అసాథారణంగా వారితో మవునంగా ఉన్నారు. వారు తమ తప్పును తెలుసుకుని మొదటినుంచి బాబాని సంప్రదించనందుకు తప్పు చేశామన్న భావం కలిగింది. వారు లోలోపల ఆయనను క్షమించమని కోరుతున్నారు. వారు ఓర్పుతో యెదురు చుశారు. అప్పుడు ద్వారకామాయిలో జనం తగ్గిపోయాక బాబా, వారిని దగ్గరకు పిలిచారు. ఆయన ప్రసంగించారు. "ఓ ! అమ్మా! మన కొడుక్కి చేయి విరిగితే అతనిని మన యింటినుంచి వెళ్ళగొట్టము. దానికి ప్రతిగా అతనికి తిండి తినిపించి, కోలుకునేలా చేసి తిరిగి మామూలు మనిషి అయేలా చేస్తాము" యిది వినగానే వారు వెంటనె ఆయన పాదాల మీద పడి మన్స్పూర్తిగా థన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రియ పాఠకులారా, బాబా విజ్ఞతను వర్ణించడానికి నేను తగిన మాటలు కనుగొనలేకపోతున్నాను. ఆయన నిజంగా "అంతర్థ్యాని". నిజం చెప్పాలంటే నీ మనసులో ఉన్నది ఆయన చదవగలరు.

బాబా లీలలు అంత గొప్పవి. ఆ తల్లి కొడుకులిద్దరూ కూడా అంతగొప్పవారు. ఈ విథంగా బాబా, యింతవరకు యిప్పటి వరకు కూడా తార్ఖడ్ కుటుంబంలో పూజలందుకుంటున్న గణేష్ మూర్తిని రక్షించారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List